Site icon HashtagU Telugu

High Cholesterol: ఈ టిప్స్‌ ఫాలో అయితే అధిక కొలెస్ట్రాల్‌ త్వరగా కరుగుతుంది.

If You Follow These Tips, High Cholesterol Will Melt Away Quickly.

If You Follow These Tips, High Cholesterol Will Melt Away Quickly.

ఈ రోజుల్లో అధిక కొలెస్ట్రాల్‌ (High Cholesterol) పెద్ద సమస్యగా మారింది. చాలా మంది ఈ ప్రాణాంతక సమస్యను ఎదుర్కొంటున్నారు. కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు ఉంటాయి. అది చెడు కొలెస్ట్రాల్‌ అయినా, మంచి కొలెస్ట్రాల్‌ అయినా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్‌ అంటారు. మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) రక్తంలోంచి చెడ్డ కొలెస్ట్రాల్‌ను తొలగించటానికి తోడ్పడుతుంది. దీనిని పెంచుకోవటం వల్ల అనారోగ్యాలను తప్పించుకోవచ్చు.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు ఎక్కువవుతుంది. ఎక్కువగా రక్తంలో ప్రయాణించటం వల్ల గుండెకు, మెదడుకు వెళ్లి ధమనులందు అవరోధం ఏర్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. మారిన లైఫ్‌స్టైల్‌, జంక్‌ ఫుడ్‌, ఒంటికి సరిగా వ్యాయామం లేకపోవటం, మితిమీరిన తిండి, కూర్చుని ఒకే చోట పనిచేయటం, నిద్రలేమి కారణంగా చెడు కొలెస్ట్రాల్‌‌ పెరుగుతుంది.

అధిక కొలెస్ట్రాల్‌ (High Cholesterol) కారణంగా గుండె సమస్యలు, స్ట్రోక్‌, హైపర్‌టెన్షన్, డయాబెటిస్‌ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ప్రముఖ పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్ బాత్రా.. కొలెస్ట్రాల్‌ తగ్గించే కొన్ని టిప్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ ద్వారా మనతో పంచుకున్నారు.

కొలెస్ట్రాల్‌ (Cholesterol) ఎలా కరుగుతుంది?

మీ ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి:

మీ డైట్‌లో సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్‌కు బదులుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌‌‌‌‌‌, కరిగే ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి రక్తంలో ట్రైగ్లిజరైడ్లనే కొవ్వు, మొత్తం కొలెస్ట్రాల్‌ తగ్గటానికి తోడ్పడతాయి. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటాన్ని నివారిస్తాయి. మీ ఆహారంలో దేశీ ఆవునెయ్యి, కొవ్వుతో కూడిన సాల్మన్‌, టూనా, సార్‌డైన్‌ వంటి చేపలను, వాల్‌నట్స్‌, అవిసె గింజలను తీసుకుంటే మంచిది. ఈ ఆహారాలు రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతాయి.

బరువు అదుపులో ఉంచుకోండి:

శరీర బరువు పెరుగుతున్న కొద్దీ రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులూ పెరిగే ప్రమాదం ఉంది. హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌ ముప్పు ఎక్కువ అవుతాయి. ఇవి రక్తనాళాల గోడలను దెబ్బతీసి పూడికలు ఏర్పడేలా చేస్తాయి. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా బెల్లీ ప్యాట్‌ కరిగించుకోవాలి. దీంతో చెడ్డ కొలెస్ట్రాల్‌ తగ్గటంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. 5 % నుంచి 10 % బరువు తగ్గడం వల్ల కొలెస్ట్రాల్‌ స్థాయిలు చాలా వరకు అదుపులో ఉంటాయి.

స్మోకింగ్‌కు దూరంగా ఉండండి:

మీరు అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటే, మీ స్మోకింగ్‌ అలవాటు వల్ల కావచ్చు. మీరు ధూమపానం మానేయడం వల్ల.. మీ ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుముఖం పడతాయి. హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలు కూడా పెరుగుతాయి. మంచి కొలెస్ట్రాల్‌ మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఆల్కహాల్‌ మానేయండి:

మద్యపానానికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే.. మితంగా తీసుకోవాలి. ఆల్కహాల్‌ ఎక్కువగా తాగితే.. అధిక కొలెస్ట్రాల్‌, హైపర్‌టెన్షన్‌ ముప్పు పెరుగుతుంది.

వ్యాయామం చేయండి:

శారీరక శ్రమ లేకపోవడం వల్ల రక్తంలోని సిరల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. రోజుకు అరగంట వ్యాయామం చేసినా కొలెస్ట్రాల్‌ తగ్గటానికి తోడ్పడుతుంది. శరీర సామర్థ్యాన్ని బట్టి ఇంకాస్త ఎక్కువసేపు చేసినా మేలే. కాస్త వేగంగా నడవటం వంటి గుండెకు పని చెప్పే వ్యాయామాలు గుండె జబ్బు, పక్షవాతం ముప్పు తగ్గేలా చేస్తాయి. బరువూ తగ్గుతుంది.

Also Read:  Kashmir Trip: ఈ వసంత 2023లో కాశ్మీర్‌ లో చేయవలసిన 7 పనులు

Exit mobile version