Site icon HashtagU Telugu

Soda Effects: రోజూ సోడా తాగితే ఏమవుతుంది ? తెలుసుకోండి

soda effects

soda effects

Soda Effects: బిర్యానీ తిన్నా, ఫ్రైడ్ రైస్ తిన్నా.. పిజ్జా, బర్గర్లు తిన్నా.. ఇలా బయటి ఫుడ్ ఏం తిన్నా సాఫ్ట్ డ్రింక్స్ కంపల్సరీ తాగుతాం. వాటిలో షుగర్, ఇతర రసాయనాలు కలుస్తాయని కొంతమంది సోడా తాగుతారు. దీనిని రోజూ తాగినా ఏం ఫర్వాలేదనుకుంటారు. కానీ.. సోడా రోజూ తాగినా ప్రమాదమేనని అధ్యయనాలు చెబుతున్నాయి. అదేపనిగా సోడా వినియోగం శరీరంపై ప్రతికూల లక్షణాలను చూపిస్తుందని పేర్కొంటున్నాయి.

సోడా అధికంగా తాగడం వల్ల బరువు సులువుగా పెరుగుతారు. వీటిలో అధికంగా చక్కెర కలిపి ఉంటుంది. అలాగే ఫ్రక్టోజ్ సిరప్ కూడా నిండి ఉంటుంది. ఎలాంటి పోషక విలువలు ఉండవు. కేవలం అదనపు క్యాలరీలు మాత్రమే శరీరానికి అందుతాయి. శక్తి వినియోగంలో, వ్యయంలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా శరీరం బరువు పెరిగి.. కొన్నాళ్లకు అది ఊబకాయంగా మారే అవకాశం ఉంది. తరచూ సోడా తాగే వారిలో మధుమేహం, గుండెజబ్బులు, కీళ్ల సమస్యలు, ఊబకాయం వంటివి వచ్చే అవకాశం ఎక్కువ. ఇన్సులిన్ నిరోధకత కూడా మొదలై.. టైప్ 2 మధుమేహానికి దారితీస్తుంది.

సోడావంటి చక్కెర పానీయాలు రోజూ తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇవి దంతాలకు కూడా హాని చేస్తాయి. ఆమ్లత్వం, చక్కెర అధికంగా ఉండటం వల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. నోటి బ్యాక్టీరియా పెరిగి.. చిగుళ్లవాపు, పీరియాంటల్ వంటి వ్యాధి వంటివి వచ్చే అవకాశం ఉంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఈ సమస్య మొదలవుతుంది. సోడాలలో కెఫిన్ కూడా అధికంగానే ఉంటుంది. నిద్రలేమి సమస్య రావొచ్చు. అంతగా తాగాలనిపిస్తే.. నెలకు ఒకటి రెండు సార్లు మాత్రమే తాగాలి. రోజూ తాగినా.. అదేపనిగా తాగినా త్వరగా రోగాలు రావడం ఖాయం.