Tooth Enamel: గతంలో దంత సమస్యలు కేవలం వయస్సు పెరగడం వల్ల లేదా అశ్రద్ధ వల్ల వస్తాయని అనుకునేవారు. కానీ ఇప్పుడు డెంటిస్ట్‌లు ఒక కొత్త ధోరణిని గమనిస్తున్నారు. ఇటీవల గణాంకాల ప్రకారం.. భారతదేశంలోని డెంటల్ రోగులలో సుమారు 27 శాతం మందిలో ఎనామిల్ కోత లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ నష్టం అశ్రద్ధ వల్ల కాకుండా మనం రోజూ పాటించే కొన్ని అలవాట్ల వల్లే జరుగుతోంది.
మన అలవాట్లే దంతాలను బలహీనపరుస్తాయి
మన దినచర్యలో భాగమైన చిన్న చిన్న అలవాట్లు దంతాల రక్షణ పొర అయిన ‘ఎనామిల్’ను నెమ్మదిగా బలహీనపరుస్తాయి.
బలంగా బ్రష్ చేయడం: గట్టిగా బ్రష్ చేస్తే పళ్ళు బాగా శుభ్రపడతాయని చాలామంది నమ్ముతారు. కానీ ఇది పూర్తిగా తప్పు. హార్డ్ బ్రష్‌లు వాడటం లేదా పళ్ళపై ఎక్కువ ఒత్తిడి పెట్టడం వల్ల ఎనామిల్ అరిగిపోతుంది.
సెన్సిటివిటీ: ఎనామిల్ పలచబడటం వల్ల దంతాలు సెన్సిటివ్‌గా మారి వేడి లేదా చల్లని పదార్థాలు తిన్నప్పుడు నొప్పి వస్తుంది.
Also Read: కొత్త కలర్స్‌లో సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250.. ధర ఎంతంటే?
జీవనశైలి- ఆహారం
నేటి ఆహారపు అలవాట్లు ఎనామిల్‌కు పెద్ద సవాలుగా మారాయి.
యాసిడ్ ప్రభావం: కోల్డ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, నిమ్మరసం వంటి పుల్లని జ్యూస్‌లు, టీ, కాఫీ, తీపి పదార్థాలు దంతాలను మాటిమాటికీ యాసిడ్ సంపర్కంలోకి తెస్తాయి.
చిట్కా: యాసిడ్ కలిగిన పానీయాలు తాగిన తర్వాత నీటితో నోటిని పుక్కిలించడం లేదా స్ట్రాఉపయోగించడం వల్ల దంతాలను కొంతవరకు కాపాడుకోవచ్చు.
నీరు తక్కువగా తాగడం కూడా ఒక కారణమే
లాలాజలం దంతాలకు ప్రకృతిసిద్ధమైన రక్షణ కవచం. ఇది నోటిలోని యాసిడ్‌ను న్యూట్రలైజ్ చేసి ఎనామిల్‌ను బలంగా ఉంచుతుంది. తక్కువ నీరు తాగడం, ఎక్కువ కాఫీ లేదా మద్యం సేవించడం వల్ల లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఎనామిల్ నేరుగా యాసిడ్ దాడికి గురవుతుంది. రోజంతా తగినంత నీరు తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండటం దంతాల రక్షణకు సులభమైన మార్గం.
ప్రమాదకరమైన ‘వైటనింగ్’ చిట్కాలు
సోషల్ మీడియాలో కనిపించే ఇంటి చిట్కాలను (నిమ్మరసం, బేకింగ్ సోడా, యాక్టివేటెడ్ చార్‌కోల్) వాడి పళ్ళను తెల్లగా మార్చుకోవాలని ప్రయత్నించడం ప్రమాదకరం. ఇవి తాత్కాలికంగా పళ్ళను మెరిపించినా వాటిలోని యాసిడ్ స్వభావం ఎనామిల్‌ను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. ఫలితంగా దంతాలు మరింత పసుపు రంగులోకి మారి సున్నితంగా తయారవుతాయి.
ఎనామిల్ రక్షణ కోసం ప్రత్యేక టూత్‌పేస్ట్
చాలామంది సాధారణ టూత్‌పేస్ట్‌లే సరిపోతాయని అనుకుంటారు. కానీ అవి కేవలం శుభ్రత లేదా వైటనింగ్ మీద మాత్రమే దృష్టి పెడతాయి. ఎనామిల్ రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లోరైడ్ ఆధారిత టూత్‌పేస్ట్‌లను వాడటం వల్ల దంతాల పటుత్వం పెరుగుతుంది. రోజువారీ యాసిడ్ దాడుల నుండి దంతాలకు రక్షణ లభిస్తుంది.
