Pregnant: మీరు తల్లి కాబోతున్నారో లేదో నిర్ధారించుకోవడానికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. అయితే సాధారణంగా శరీరంలో కొన్ని విభిన్నమైన మార్పులు లేదా సంకేతాలు కనిపించినప్పుడే మహిళలు ఈ పరీక్ష చేసుకుంటారు. గర్భం దాల్చినప్పుడు శరీరంలో కనిపించే ఆ ముఖ్యమైన లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి. వీటి ఆధారంగా మీరు టెస్ట్ చేసుకోవడం లేదా డాక్టర్‌ను సంప్రదించడం ద్వారా గర్భధారణను నిర్ధారించుకోవచ్చు.
గర్భధారణ ముఖ్య లక్షణాలు
పీరియడ్స్ రాకపోవడం
ఇది గర్భధారణకు అత్యంత సాధారణ, ప్రధాన సంకేతం. గర్భం దాల్చిన తర్వాత శరీరం అండోత్పత్తిని, గర్భాశయ లోపలి పొర విడిపోవడాన్ని నిరోధించే హార్మోన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల పీరియడ్స్ ఆగిపోతాయి. అయితే హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా పీరియడ్స్ మిస్ కావచ్చు. కానీ అసురక్షిత సెక్స్ తర్వాత పీరియడ్స్ రాకపోతే మాత్రం తప్పనిసరిగా టెస్ట్ చేసుకోవాలి.
విపరీతమైన అలసట
శరీరంలో ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంది. ప్రొజెస్టిరాన హార్మోన్ స్థాయిలు పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. గర్భధారణ మొదటి మూడు నెలల్లో ఈ లక్షణం సర్వసాధారణం.
తరచుగా మూత్ర విసర్జన
పీరియడ్ మిస్ కావడానికి ముందే మీరు ఈ లక్షణాన్ని గమనించవచ్చు. గర్భధారణ సమయంలో శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. దీనివల్ల కిడ్నీలు రక్తాన్ని ఎక్కువగా ఫిల్టర్ చేస్తాయి. దీని ఫలితంగా వ్యర్థ పదార్థాలు మూత్ర రూపంలో ఎక్కువగా బయటకు వస్తాయి. అందుకే పదే పదే బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది.
వికారం- వాంతులు
ఉదయం లేదా సాయంత్రం వేళల్లో అనారోగ్యంగా అనిపించడం, జిలదరింపు లేదా వాంతులు రావడం వంటివి జరుగుతాయి. అయితే ఇది అందరు మహిళల్లోనూ ఒకేలా ఉండదు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కూడా ఇలా అనిపించవచ్చు.
రొమ్ములలో మార్పులు
పీరియడ్స్ రావడానికి ముందు ఎలాగైతే రొమ్ములు వాపుగా లేదా నొప్పిగా అనిపిస్తాయో, గర్భం దాల్చినప్పుడు కూడా అలాగే అనిపించవచ్చు. ఇది తాత్కాలిక మార్పు మాత్రమే.
Also Read: మీ క్రెడిట్ కార్డ్ వాడకం మీ లోన్ అర్హతను దెబ్బతీస్తోందా?
ఇతర లక్షణాలు
స్పాటింగ్: తేలికపాటి రక్తపు చుక్కలు కనిపించవచ్చు.
ఆకలి పెరగడం: తరచుగా ఆకలి వేయడం, పుల్లని లేదా తీపి పదార్థాలు తినాలనిపించడం.
నోటి రుచి మారడం: నోటిలో నాణేలు ఉన్నట్లుగా లోహపు రుచి రావడం.
తలనొప్పి- కళ్లు తిరగడం: తరచుగా తలనొప్పి రావడం లేదా కళ్లు తిరిగినట్లు అనిపించడం.
కడుపు నొప్పి: కడుపు కింది భాగంలో స్వల్పంగా నొప్పి రావడం.
మూడ్ స్వింగ్స్: మూడ్ తరచుగా మారడం, ఆందోళన లేదా నిరాశగా అనిపించడం.
కడుపు ఉబ్బరం: కడుపు ఉబ్బరంగా అనిపించడం.
చర్మ మార్పులు: మొటిమలు రావడం లేదా చర్మం రంగులో మార్పులు రావడం.
ప్రారంభ లక్షణాలు ఎప్పుడు కనిపిస్తాయి?
గర్భం దాల్చిన కొన్ని రోజుల్లోనే (సుమారు 6 నుండి 12 రోజుల్లో) కొంతమందికి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరికి కొన్ని వారాల తర్వాత ఇవి స్పష్టంగా తెలుస్తాయి.
