వేసవి కాలం వచ్చిందంటే చాలు నోరూరించే మామిడి పండ్ల కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అయితే, మార్కెట్లో అధిక లాభాల కోసం కృత్రిమంగా పండించిన కల్తీ మామిడి పండ్లు విక్రయిస్తున్నారు. వీటిని గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మామిడి పండ్ల సీజన్ మొదలవగానే మార్కెట్‌లోకి రంగురంగుల పండ్లు వచ్చి చేరుతుంటాయి. అయితే, సహజంగా చెట్టుపై పక్వానికి వచ్చే వరకు ఆగకుండా, వ్యాపారులు ‘కాల్షియం కార్బైడ్’ వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి పండ్లను మాగబెడుతున్నారు. ఇలాంటి కల్తీ పండ్లను తినడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి మరియు తల తిరగడం వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పండ్లను కొనే ముందు అవి సహజంగా పండినవా లేదా రసాయనాలతో పండించినవా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మామిడి పండును చూడగానే అది కల్తీదో కాదో కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా గుర్తించవచ్చు. పండు మొత్తం ఏకరీతిలో గాఢమైన పసుపు రంగులో ఉంటే అది రసాయనాలతో పండించినట్లు అనుమానించాలి. సహజంగా పండిన పండు అక్కడక్కడా ఆకుపచ్చగా, మరికొంత భాగం పసుపు రంగులో ఉంటుంది. అలాగే, పండును చేత్తో నొక్కి చూసినప్పుడు అన్ని వైపులా సమానంగా మెత్తగా ఉంటే అది సహజమైనది. ఒకవైపు గట్టిగా, మరోవైపు మెత్తగా ఉన్నా లేదా పైన పండినట్లు కనిపించి లోపల గట్టిగా ఉన్నా అది కృత్రిమంగా మాగబెట్టిన పండు అని అర్థం చేసుకోవాలి.
సహజంగా పండిన మామిడి పండు తొడమ దగ్గర మంచి తీపి వాసన వస్తుంది. ఒకవేళ ఎలాంటి వాసన రాకపోయినా లేదా ఘాటైన రసాయనాల వాసన వచ్చినా వాటిని కొనుగోలు చేయకపోవడమే మంచిది. మరొక ముఖ్యమైన చిట్కా ఏమిటంటే.. ఒక బకెట్ నీటిలో మామిడి పండ్లను వేయాలి. ఏ పండు అయితే నీటి అడుగుకు చేరుతుందో అది సహజంగా పండినది, నీటిపై తేలే పండ్లు రసాయనాలతో పండించినవని గుర్తించాలి. పండు కోసినప్పుడు లోపల మంచి పసుపు రంగులో ఉండి, సహజమైన తీపి రుచిని కలిగి ఉంటేనే అది ఆరోగ్యానికి సురక్షితం. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా కల్తీ పండ్ల బారిన పడకుండా ఉండవచ్చు.
