Site icon HashtagU Telugu

Pregancy Tips: ప్రెగ్నెన్సీ స్త్రీలకు కాళ్లు చేతులు ఎందుకు ఉబ్బుతాయో తెలుసా?

Pregnancy Tips

Pregnancy Tips

మాములుగా స్త్రీలకు ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో మార్పులు రావడం అన్నది సహజం. అందులో కాళ్ళు, చేతులు వాపు రావడం కూడా ఒకటి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో పాదాల వాపు అనేది సర్వ సాధారణం. దీన్ని వైద్య భాషలో ఎడెమా అంటారు. అయితే ఈ వాపు చేతులు, ముఖంపై కనిపిస్తే ఇది ప్రీక్లాంప్సియాకు సంకేతంగా భావిస్తారు. అయితే అసలు ఈ ఎడెమా అంటే ఏంటి? అన్న విషయానికి వస్తే.. ప్రెగ్నెన్సీ సమయంలో పాదాల వాపు అనేది ఒక సాధారణ సమస్య. కడుపులో పెరుగుతున్న బిడ్డ అవసరాలను తీర్చడానికి శరీరం ఉత్పత్తి చేసే అదనపు రక్తం, ద్రవం కారణంగా కాళ్లు, చేతులు వాపు వస్తాయి.

ఈ కారణంగా పాదాలలో మాత్రమే కాకుండా చేతులు, ముఖంతో పాటు శరీరంలోని కొన్ని భాగాలలో వాపు వస్తుంది. అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఆడవారి శరీరంలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్, హెచ్సిజి, ప్రోలాక్టిన్ వంటి చాలా రకాల హార్మోన్ల లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. దీని వల్ల ఎడెమా వస్తుంది. అదేవిధంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారు బరువు బాగా పెరిగిపోతారు. అయితే ఈ సమయంలో బరువు పెరగడం వల్ల కూడా పాదాలలో వాపు వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో ఆడవాళ్ల శరీరంలో ప్రోటీన్, హిమోగ్లోబిన్ లోపం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా పాదాల వాపు సమస్య వస్తుంది. అయితే డెలివరీ తర్వాత పాదాలు తిరిగి సాధారణ స్థితికి వస్తాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం లేదా నిలబడటం వల్ల కూడా పాదాలలో వాపు వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు పాదాలకు విశ్రాంతి ఇవ్వడానికి మంచంపై ఒక దిండును ఉంచి దాని పైన మీ పాదాలతో 20 నిమిషాల పాటు పెట్టి పడుకోవాలని చెబుతున్నారు. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేయడం వల్ల పాదాల వాపు అలాగే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అయితే పాదాలలో వాపు అనిపిస్తే నీళ్లలో ఎప్సమ్ సాల్ట్ ను వేసి అందులో మీ పాదాలను పెట్టాలి. ఎప్సమ్ సాల్ట్ లో ఉండే లక్షణాలు పాదాల కండరాలను కుదించి నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.

ఈ రెమెడీ చేయడానికి, ఒక పెద్ద బకెట్ లో వేడి నీటిని తీసుకొని దానిలో ఒక టీస్పూన్ ఎప్సమ్ సాల్ట్ ను కలపాలి. తర్వాత ఈ నీటిలో మీ పాదాలను 20 నుంచి 25 నిమిషాల పాటు నాన బెట్టాలి. కాగా ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో పొటాషియం లేకపోవడం కూడా పాదాల వాపు వస్తుంది. దీనివల్ల అధిక రక్తపోటు, నీరు నిలుపుదల సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే ఈ సమస్యను తగ్గించడానికి పొటాషియం ఎక్కువగా ఉండే బంగాళదుంపలు, అరటిపండ్లు, దానిమ్మ, పిస్తా, చిలగడ దుంపలు వంటి వాటిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

note: ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి.