Site icon HashtagU Telugu

Food Life : ఎలాంటి ఆహారం తీసుకోకుండా మనం ఎంతకాలం జీవించగలం ?

Food Life

Food Life

Food Life :  ఉదయం లేచిన తర్వాత.. ఫ్రెషప్ అవగానే మనకు కడుపులో ఎలుకలు పరిగెడతాయ్. అంటే ఆకలివేస్తుంది. ఏదొకటి తిననిదే ఉండలేం. ఎప్పుడైనా ఉపవాసం చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. మహా అయితే ఒక రోజంతా ఏమి తినకుండా ఉంటాం. అప్పటికే కళ్లు తిరగడం, నీరసం, బీపీ డౌన్ అవ్వటం వంటివి వచ్చేస్తాయి. కానీ ఒక మనిషి ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఎంతకాలం ఉండగలడు అని ఎప్పుడేనా ఆలోచించారా ? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

పూర్తి ఆరోగ్యంగా 70 కిలోల బరువు ఉన్న ఒక వ్యక్తి.. మంచి పోషకాహారం తీసుకున్నవ్యక్తి 1 నుంచి 3 నెలల మధ్య జీవించేందుకు తగిన కేలరీలను కలిగి ఉంటాడట. కానీ.. స్వచ్చందంగా ఆహారం తినడం మానేసి.. నిరాహార దీక్షల్లో పాల్గొన్న వ్యక్తులు 45-61 రోజుల తర్వాత మరణించిన సందర్భాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంటే వారి అభిప్రాయం ప్రకారం ఆహారం లేకుండా ఒక వ్యక్తి 3 నెలలు జీవించే అవకాశం చాలా తక్కువ. మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు ఆహారంలో పోషకాలు చాలా అవసరం. ఇవి శరీరంలో కణాల పునరుద్ధరణకు, ముఖ్యమైన శారీరక ప్రక్రియలకు ఇంధనాన్ని సప్లై చేసేందుకు ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలను ఉపయోగిస్తుంది.

మనిషి ఆహారం లేకుండా ఎంతకాలం ఉండవచ్చన్న విషయాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అతని వయసు, లింగం, శరీర పరిమాణం, ఫిట్ నెస్, సాధారణ ఆరోగ్యం, కార్యాచరణ స్థాయి ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే సదరు వ్యక్తి తీసుకునే ద్వ పరిమాణం కూడా ఎక్కువగా ఉండాలి.

ఆహారం తీసుకోకుండా జీవించేటపుడు శరీరం స్వంత కణజాలాన్ని విచ్ఛిన్నంచేసి దానిని ఇంధనంగా ఉపయోగిస్తుంది. కానీ.. పల్స్, బీపీ పడిపోతాయి. అందుకు కారణం శరీరమంతా రక్తాన్ని సరఫరా చేసేందుకు అవసరమైన ఇంధనం ఉండకపోవడమే.

ఎక్కువ రోజులు ఆహారం తీసుకోకుండా ఉంటే.. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, వాంతులు, వికారం, రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, మలబద్ధకానికి కారణమవుతాయి. ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాస్ వాపు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

అలాగే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గిపోతాయి. నిద్రలేమి సమస్య, ఎముకలు బలహీనపడటం, శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడం, జుట్టురాలడం, జుట్టు గరుకుగా ఉండటం వంటి మార్పులు వస్తాయి. మహిళలకైతే రుతుక్రమం పూర్తిగా ఆగిపోవడం లేదా సక్రమంగా రాకపోవడం వంటి సమస్యలు వస్తాయి. మొత్తంమీద నిపుణులు చెప్పేదేంటంటే.. ఎక్కువకాలం ఆహారం తీసుకోకుండా ఉండటం ప్రమాదం. మితంగా.. శరీరానికి అవసరమయ్యే పోషకాలు లభించే ఆహారాలను తీసుకోవడం ఉత్తమం.