మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

Published By: HashtagU Telugu Desk
Hormonal Imbalance

Hormonal Imbalance

Hormonal Imbalance: పుట్టినప్పటి నుండి శరీరంలో అనేక రకాల హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మన శరీరంలోని మెజారిటీ విధులను నియంత్రించే రసాయనాలు. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత సర్వసాధారణం. ఇది ఎదుగుదల, జీవక్రియ, మానసిక స్థితి, పునరుత్పత్తి, లైంగిక పనితీరుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం.

హార్మోన్ల అసమతుల్యత లక్షణాలు

జుట్టు రాలడం: హార్మోన్ల అసమతుల్యత వల్ల జుట్టు వేగంగా రాలడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా డెలివరీ తర్వాత మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

Also Read: హ్యుందాయ్ వెన్యూ సరికొత్త మైలురాయి!

ముఖంపై అవాంఛిత రోమాలు: మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతకు ఇది ఒక ప్రధాన లక్షణం. ముఖంపై లేదా గడ్డం భాగంలో ఎక్కువగా జుట్టు రావడం శరీరంలో పురుష హార్మోన్లు పెరగడానికి సంకేతం కావచ్చు.

చర్మ సమస్యలు: హార్మోన్ల హెచ్చుతగ్గులు చర్మం రంగు, ఆకృతిని మారుస్తాయి. ముఖం, ఛాతీ, వీపుపై మొటిమలు రావడం లేదా చర్మంపై నల్లని మచ్చలు కనిపించడం వంటివి జరుగుతాయి.

పీరియడ్స్‌లో మార్పులు: పీరియడ్స్ రాకపోవడం, క్రమం తప్పడం, లేదా అతిస్రావం జరగడం హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన సంకేతాలు. ప్రధానంగా ఈస్ట్రోజెన్ స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనైనప్పుడు ఇలా జరుగుతుంది. అయితే ఆహారం, వ్యాయామం, మానసిక ఒత్తిడి కూడా దీనికి కారణం కావచ్చు.

బరువుపై ప్రభావం: ఎటువంటి కారణం లేకుండానే అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం వంటివి హార్మోన్ల అసమతుల్యతను సూచిస్తాయి. థైరాయిడ్ రుగ్మతలు లేదా PCOS వంటి పరిస్థితుల వల్ల శరీర బరువులో మార్పులు రావచ్చు.

లైంగిక సంబంధిత లక్షణాలు: లైంగిక వాంఛ తగ్గడం, సంభోగం సమయంలో నొప్పి, జననేంద్రియాల వద్ద పొడిబారడం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల జరగవచ్చు. ఇవి ఎక్కువగా మెనోపాజ్ తర్వాత కనిపిస్తాయి.

మానసిక స్థితి- నిద్ర సమస్యలు: నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

  Last Updated: 10 Mar 2026, 08:40 PM IST