Fatty Liver: సన్నగా ఉన్నవారిలో కనిపించే ఫ్యాటీ లివర్ గురించి నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!

Fatty Liver Stages  కొవ్వు కాలేయం అనేది అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి మాత్రమే వచ్చే సమస్య అని చాలా మంది నమ్ముతారు. ఫ్యాటీ లివర్ అనేది ఊబకాయం ఉన్నవారికి మాత్రమే కాకుండా సన్నగా ఉన్న వ్యక్తుల్లో కూడా కనిపిస్తుంది. జంక్ ఫుడ్, ఆల్కహాల్, ధూమపానం, నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి ఆధునిక జీవనశైలి అలవాట్లు కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. దీంతో ప్రారంభ దశల్లో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా అభివృద్ధి […]

Published By: HashtagU Telugu Desk
Fatty Liver Stages

Fatty Liver Stages

Fatty Liver Stages  కొవ్వు కాలేయం అనేది అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి మాత్రమే వచ్చే సమస్య అని చాలా మంది నమ్ముతారు. ఫ్యాటీ లివర్ అనేది ఊబకాయం ఉన్నవారికి మాత్రమే కాకుండా సన్నగా ఉన్న వ్యక్తుల్లో కూడా కనిపిస్తుంది. జంక్ ఫుడ్, ఆల్కహాల్, ధూమపానం, నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి ఆధునిక జీవనశైలి అలవాట్లు కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. దీంతో ప్రారంభ దశల్లో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా అభివృద్ధి చెందుతున్న నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

మానవ శరీరంలో కాలేయం అతిపెద్ద అంతర్గత అవయవం. ఇది ఎన్నో రకాల విధులను నిర్వహిస్తుంది. అయితే, ఈ రోజుల్లో కాలేయానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువయ్యాయి. అలాంటి వాటిలో ఫ్యాటీ లివర్ ఒకటి. అయితే, బరువు ఎక్కువగా ఉన్నవారిలోనే కాకుండా సన్నగా ఉన్నవారిలో కూడా ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ (NAFLD) సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీనిని ‘లీన్ ఎన్.ఏ.ఎఫ్.ఎల్.డి’ (Lean NAFLD) అంటారు.

సాధారణంగా ఫ్యాటీ లివర్ అనగానే ఊబకాయం వల్ల వస్తుందని అనుకుంటాం. కానీ సన్నగా ఉన్నవారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, జన్యుపరమైన కారణాలు, ఆహారపు అలవాట్లు, ప్రస్తుత జీవనశైలి, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.

Fatty Liver Stages

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అంటే ఏమిటి?

సాధారణంగా కాలేయంలో కొద్ది మొత్తంలో కొవ్వు ఉండటం సహజం. కానీ, లివర్ బరువులో ఐదు నుంచి 10 శాతం కంటే ఎక్కువ కొవ్వు పేరుకుపోతే దానిని ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది:

  • సింపుల్ ఫ్యాటీ లివర్ (NAFL): కాలేయంలో కొవ్వు ఉంటుంది కానీ ఎటువంటి వాపు ఉండదు. ఇది అంత ప్రమాదకరమైనది కాదు.
  • NASH (Non-Alcoholic Steatohepatitis): ఇది తీవ్రంగా ఉంటుంది. కొవ్వుతో పాటు కాలేయం వాపుకు గురవుతుంది. దీనివల్ల కాలేయ కణాలు దెబ్బతింటాయి.

సన్నగా ఉన్నవారిలో ఫ్యాటీ లివర్ రావడానికి కారణాలు

  1. ఇన్సులిన్ రెసిస్టెన్స్: శరీరంలో ఇన్సులిన్‌ను సరిగ్గా వాడుకోలేకపోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది.
  2. జన్యుపరమైన కారణాలు: కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది.
  3. తిండి అలవాట్లు: ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తినడం, మైదా, అన్నం ఎక్కువగా తినడం, తీపి పదార్థాలు, షుగరీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.
  4. శారీరక శ్రమకు దూరం: ఈ రోజుల్లో చాలా మంది బిజీ లైఫ్‌స్టైల్ గడుపుతున్నారు. దీంతో బరువు తక్కువగా ఉన్నా వ్యాయామం చేయకపోవడం వల్ల మెటబాలిక్ సమస్యలు తలెత్తుతాయి.
  5. ధూమపానం: ఈ రోజుల్లో చాలా మందికి స్మోకింగ్ అలవాటు ఉంది. ఈ అలవాటు కారణంగా కూడా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.
  6. నిద్ర లేకపోవడం: శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. అయితే, ఈ రోజుల్లో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో, ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు.

ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

చాలామందిలో ఎటువంటి లక్షణాలు బయటపడవు. అయితే కొంతమందిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏమిటంటే:

  • అధిక అలసట: చిన్న చిన్న పనులకే అలసిపోవడం, విశ్రాంతి తీసుకున్నా అలసట తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • కడుపులో కుడివైపు పైభాగంలో నొప్పి: ఉదరం కుడివైపు పైభాగంలో అసౌకర్యంగా లేదా భారంగా అనిపించడం.
  • ఆకలి తగ్గడం, బరువు తగ్గడం: ఉన్నట్టుండి బరువు తగ్గడం, ఏదీ తినాలని అనిపించకపోవడం.
  • లివర్ ఎంజైమ్స్‌లో తేడా: రక్త పరీక్షల్లో లివర్ ఎంజైమ్స్ (LFT)లో తేడాలు రావడం.
  • సిరోసిస్ దశలో: కళ్ళు/చర్మం పచ్చబడటం (Jaundice), కడుపు ఉబ్బరం, కాళ్ళ వాపు, కళ్ల కింద వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

తీసుకోవలసిన ఆహారం

ఆహార రకం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి?
ఫైబర్ పొట్టు తీయని ధాన్యాలు (ఓట్స్, బ్రౌన్ రైస్), ముడి చిరుధాన్యాలు (రాగులు, జొన్నలు).
పండ్లు యాపిల్ (తొక్కతో), జామ, అరటి, బెర్రీలు
ఆకుకూరలు, కూరగాయలు పాలకూర, తోటకూర, బ్రకోలీ, క్యారెట్, బీరకాయ, సొరకాయ, చిలగడదుంప
ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అవిసె గింజలు, వాల్‌నట్స్, చేపలు (సాల్మన్, మాకెరెల్, సార్డిన్స్).
ప్రోటీన్ పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, గుడ్డులోని తెల్లసొన, గ్రిల్డ్ చికెన్

మానుకోవాల్సిన ఆహారాలు

  • తీపి పదార్థాలు, షుగరీ డ్రింక్స్: చక్కెర కలిపిన పానీయాలు, సోడాలు, కూల్ డ్రింక్స్, స్వీట్స్ వంటి వాటిని తీసుకోవడం తగ్గించాలి.
  • మైదా పదార్థాలు: వైట్ బ్రెడ్, బిస్కెట్లు, పాస్తా, బేకరీ ఐటమ్స్ తీసుకోవడం మానేయాలి.
  • బాగా వేయించిన ఆహారాలు: నూనెలో బాగా వేయించిన పదార్థాలు, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్‌కు గుడ్ బై చెప్పాలి.
  • ప్రాసెస్డ్ ఫుడ్స్: ప్యాక్ చేసిన స్నాక్స్, చిప్స్ వంటి వాటిని తీసుకోవడం తగ్గించాలి.
  • మద్యపానం, స్మోకింగ్: లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లను మానేయడం చాలా మంచిది.

నిర్ధారణ పరీక్షలు

  1. పరీక్షలు: లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT) ద్వారా ఎంజైమ్స్ (SGOT, SGPT) పెరిగాయేమో చూస్తారు.
  2. అల్ట్రాసౌండ్ స్కానింగ్: కాలేయంలో కొవ్వును గుర్తించడానికి ఇది ప్రాథమిక పరీక్ష.
  3. ఫైబ్రోస్కాన్: కాలేయం ఎంత గట్టిపడిందో (Fibrosis) తెలుసుకోవడానికి చేసే అధునాతన పరీక్ష.
  4. బయాప్సీ: చాలా అరుదుగా, వ్యాధి తీవ్రతను బట్టి కణజాలాన్ని తీసి పరీక్షిస్తారు.

పాటించాల్సిన ఇతర చిట్కాలు

  • తగినంత నీరు: రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి. నీరు తాగడం వల్ల కాలేయంలోని వ్యర్థాలు తొలగిపోతాయి.
  • వంట నూనె: రిఫైన్డ్ ఆయిల్స్ తగ్గించి తక్కువ మొత్తంలో గానుగ నూనెలు వాడటం మంచిది. నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ అయితే ఇంకా మంచిది.
  • రాత్రి భోజనం: పడుకోవడానికి కనీసం 2-3 గంటల ముందే భోజనం తినడం పూర్తి చేయాలి.
  • కెఫీన్ తగ్గించడం: టీ, కాఫీతో పాటు కెఫీన్ ఎక్కువగా ఉన్న ఇతర ఆహార పదార్థాలు పూర్తిగా మానేయడం లేదా చాలా తగ్గించడం ముఖ్యం.
  • వ్యాయామం: సన్నగా ఉన్నప్పటికీ, కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే రోజుకు ముప్పై నిమిషాల పాటు చురుకైన నడక తప్పనిసరి. మితంగా కార్డియో వ్యాయామాలు చేయడం కూడా మంచిది.
  • తగినంత నిద్ర: రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల గాఢ నిద్ర తప్పనిసరి అని గుర్తించుకోండి.

చివరగా ఏమి తెలుసుకోవాలి?

క్రమం తప్పకుండా లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT), స్కానింగ్ చేయించుకోవడం ద్వారా సమస్య పెరగకుండా (ఫైబ్రోసిస్/సిర్రోసిస్) చూసుకోవచ్చు. మీకు రిపోర్టులో గ్రేడ్ 1 లేదా గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని వస్తే కంగారు పడకండి. సరైన ఆహారం, వ్యాయామంతో దీనిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావచ్చు. మీకు ఏదైనా లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి తగిన సలహా తీసుకోండి.

 

  Last Updated: 23 Mar 2026, 01:04 PM IST