కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఆకస్మిక మరణాలు, ముఖ్యంగా గుండెపోటుల పెరుగుదలపై ప్రజల్లో అనేక సందేహాలు, అపోహలు నెలకొన్నాయి. కొంతమంది యువత వ్యాక్సిన్ తీసుకున్న తరువాత హఠాత్తుగా మరణించడం చూసి ఈ రెండు అంశాలకు సంబంధం ఉందని భావించారు. కానీ, దేశంలోని అత్యున్నత వైద్య సంస్థలు అయిన ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) మరియు AIIMS (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఈ విషయంపై లోతైన పరిశోధనలు నిర్వహించాయి. తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం.. కోవిడ్ వ్యాక్సిన్ మరియు ఆకస్మిక గుండెపోటుల మధ్య ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా వెల్లడించారు.
Ola-Uber : ఉబర్ , ఓలా వంటి సంస్థలకు కేంద్రం గుడ్‌న్యూస్
ICMR కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (NIE) 2023 మే నుంచి ఆగస్టు వరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 47 ఆసుపత్రుల డేటా ఆధారంగా అధ్యయనం చేపట్టింది. ఈ డేటాలో 18-45 ఏళ్ల మధ్య వయస్సు గల, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అకస్మాత్తుగా మరణించిన వారి వివరాలు పరిశీలించారు. ఫలితంగా, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఆకస్మిక మరణాలు పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తేలింది. అలాగే, AIIMS ఢిల్లీ ప్రస్తుత పరిశోధనలో కూడా గుండెపోటు, జన్యుపరమైన వ్యాధులు, జీవనశైలి తేడాలు ప్రధాన కారణాలుగా గుర్తిస్తున్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వం, వైద్య నిపుణులు ఒకే మాట చెబుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనది, ఇది ప్రాణాలను కాపాడింది, కాపాడుతోంది కూడా. ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా వ్యాక్సిన్‌ను విమర్శించడం ప్రజల్లో భయం రేకెత్తించడమే కాక, ఆరోగ్యానికి హానికరం. వ్యాక్సిన్ వల్ల ప్రమాదం అపోహలు వ్యాప్తి చేస్తే ప్రజలు టీకాలు తీసుకోవడాన్ని మానేస్తారు. ఇది ప్రజారోగ్యానికి తీవ్ర హాని చేస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. అందుకే, అపోహలకు బలవ్వకుండా, శాస్త్రీయంగా నిర్ధారించబడిన వాస్తవాలపై ఆధారపడాలని నిపుణులు సూచిస్తున్నారు.