‎Heart Attack: ఒంటరిగా ఉన్నప్పుడు గుండె నొప్పి వస్తే ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు పాటించలో తెలుసా?

‎Heart Attack: ఒంటరిగా ఉన్నప్పుడు పొరపాటున గుండె నొప్పి వస్తే ఏం చేయాలి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Heart Attack

Heart Attack

Heart Attack: ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మంది గుండె పోటు కారణంగా మరణిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ గుండెపోటు కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే గుండెపోటు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆహారపు అలవాట్లు అయితే రెండవది జీవనశైలి, మూడవది అనారోగ్య పరిస్థితులు. స్త్రీ పురుష అని తేడా లేకుండా వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటు కారణంగా మరణిస్తున్నారు. అయితే చాలామంది సరైన వైద్యం అందక చనిపోతున్న విషయం తెలిసిందే.

‎గుండెపోటు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయం తెలియక చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. మరి ఒకవేళ ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీకు గుండె నొప్పి వచ్చినట్లు ఏవైనా సంకేతాలు కనిపిస్తే ముందు చేయాల్సిన పని కంగారు పడకూడదట. మీరు వెంటనే మీ ఫోన్ నుంచి ఎమర్జెన్సీ సర్వీస్ కి కాల్ చేయాలని, లేదా మీ ఇంటి డోర్ లాక్ చేసి ఉంటే అన్ లాక్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఎవరికైనా సహజంగా భయం, ఆందోళన కలుగుతుంది. కానీ భయపడకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలట.

‎మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం లేదంటే కనీసం అంబులెన్స్ కి ఫోన్ చేయడం లాంటి పనులు చేయాలట. అలాగే భయపడకుండా ఉండటం చాలా ముఖ్యమట ప్రశాంతంగా, రిలాక్స్ గా ఉండాలట. సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోవాలని, మీకు ఇప్పటికే గుండె జబ్బు ఉంటే అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని చెబుతున్నారు. రక్తంలో అవసరమైన స్థాయిలో ఆక్సిజన్ ఉండేలా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలట. ఇలాంటి సమయంలో ఎలాంటి శారీరక శ్రమలో పాల్గొనవద్దని చెబుతున్నారు. ఏదైనా తినడానికి లేదా తాగడానికి ప్రయత్నించకూడదట. ఎందుకంటే, ఇది మీ పరిస్థితి మరింత ఇబ్బందుల్లో పడేస్తుందని చెబుతున్నారు. మీరు గాలి పీల్చుకోవడానికి వీలుగా ఉండేందుకు ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచుకోవాలట. హాస్పిటల్ కి వెళ్లేందుకు మీరే డ్రైవింగ్ చేసుకుంటూ అస్సలు వెళ్లకూడదని, ఇతరుల సహాయం తీసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.

‎కాగా గుండెపోటు అనేది అత్యంత అత్యవసర వైద్య పరిస్థితి. ఇది గుండె కండరాలలో ఒక భాగానికి కావలసినంత రక్త ప్రవాహం అందకపోవడం వల్ల సంభవిస్తుందట. రక్తప్రవాహం ఆగిపోయినప్పుడు గుండె కండరాలకు ఆక్సిజన్ అందదట. దాంతో కండర కణాలు దెబ్బతిని చనిపోవడం ప్రారంభమవుతుందని, గుండె ధమనుల్లో అడ్డంకి ఏర్పడడం, ముఖ్యంగా కొవ్వు, కొలెస్ట్రాల్, ప్లాక్ పేరుకుపోవడం రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడానికి కారణం అవుతుందని చివరికి హార్ట్ ఎటాక్ రావడానికి కారణం అవుతుందని చెబుతున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు ముఖ్యంగా ఛాతీ మధ్యలో బరువుగా, నొప్పిగా లేదా మంటగా అనిపిస్తుందట. ఈ నొప్పి కొన్ని నిమిషాలు కొనసాగవచ్చని, లేదా నొప్పి వస్తూ పోతూ ఉండవచ్చని చెబుతున్నారు. చేతులు, వీపు, మెడ, దవడ లేదా కడుపు ప్రాంతాలకు నొప్పి వ్యాపించడం గుండెపోటుకు సూచన కావచ్చని చెబుతున్నారు. ఛాతీ నొప్పితో పాటు లేదా ఛాతీ నొప్పి లేకుండానే శ్వాస తీసుకోవడంలో కష్టంగా అనిపించవచ్చట. చెమట పడటం, వికారం, వాంతులు, తల తిరగడం లేదా మూర్ఛ వచ్చినట్లుగా అనిపించవచ్చట.

  Last Updated: 09 Dec 2025, 08:32 AM IST