Heart Attack: ఇప్పటి వరకు అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, అధిక రక్తపోటు, వ్యాయామం లేకపోవడం వంటివే గుండెపోటుకు కారణమని భావించేవారు. అయితే తాజాగా ఫిన్లాండ్, బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. వారు నిర్వహించిన అధ్యయనంలో నోటి శుభ్రత కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని తేలింది.
జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం, విరిడాన్స్ స్ట్రెప్టోకోకి అనే నోటి బ్యాక్టీరియా గుండెపోటుకు కారణమవుతుందని తేలింది. అకస్మాత్తుగా మరణించిన 121 మంది గుండె రోగులపై, అలాగే శస్త్రచికిత్స చేయించుకున్న 96 మంది రోగుల ధమనుల్లో జరిగిన పరీక్షలలో దాదాపు సగం మంది శరీరాల్లో ఈ బ్యాక్టీరియాకు చెందిన డీఎన్‌ఏను గుర్తించారు.
ఇది గుండెపోటుకు ఎలా దారితీస్తుంది
ఈ బ్యాక్టీరియా గుండె ధమనుల్లో ఏర్పడే కొవ్వు పొరల్లో పేరుకుపోతుంది. ఇది కాలక్రమంలో బయోఫిల్మ్‌గా మారుతుంది. ఫలితంగా శరీర రోగనిరోధక వ్యవస్థ దీనిని గుర్తించలేకపోతుంది. ఆ ఫలకం చీలిపోతే, దాని శకలాలు ధమనుల్లోకి విడుదలవుతాయి. ఇది వాపుకు, తద్వారా గుండెపోటుకు దారితీస్తుంది.
నోటి పరిశుభ్రత చాలా ముఖ్యం
నోటి ఆరోగ్యం పాటించడం ద్వారా గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యలను నివారించవచ్చు. దానికి పాటించవలసిన కొన్ని ముఖ్యమైన చర్యలు ఇవే
-
రోజుకు రెండుసార్లు పళ్లను శుభ్రంగా తోముకోవాలి
-
చిగుళ్లకు వాపు, రక్తస్రావం ఉంటే వెంటనే దంతవైద్యుడిని సంప్రదించాలి
-
తీపి పదార్థాలను తగ్గించుకోవాలి
-
ప్రతి మూడునెలలకు టూత్‌బ్రష్ మార్చాలి
-
పొగాకు ఉత్పత్తులను పూర్తిగా మానాలి
-
సంవత్సరానికి ఒక్కసారైనా డెంటల్ చెకప్ చేయించుకోవాలి
గమనిక
ఈ సమాచారాన్ని పరిశోధనల ఆధారంగా అందించాం. ఆరోగ్య సమస్యల విషయంలో నిపుణులైన వైద్యుల సలహా తప్పనిసరి.
