Site icon HashtagU Telugu

Healthy Drink : వేసవిలో ఈ జావలు తయారుచేసుకొని తాగండి.. ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

Healthy Drinks Ragi Malt and so many in summer how to prepare ragi java

Healthy Drinks Ragi Malt and so many in summer how to prepare ragi java

వేసవి(Summer)లో మనం ఇంటిలో జావలు తయారుచేసుకొని తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన పెద్దవారు సాయంత్రం అయితే అందరూ జావలు తాగేవారు కానీ ఇప్పుడు టీ(Tea)లు, కాఫీలు తాగుతున్నారు. టీల వలన మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు కానీ జావలు తాగితే మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు, సామలు.. ఇలాంటి తృణధాన్యాలతో జావలు చేసుకొని ఎండాకాలంలో తాగితే ఆరోగ్యానికి మంచిది.

కొర్రల జావ తయారీకి కావలసిన పదార్థాలు:-
* కొర్రలు ఒక కప్పు
* నీరు పది కప్పులు
* పెరుగు ఒక కప్పు
* ఉప్పు తగినంత

కొర్రలను ఒకరోజు రాత్రి అంతా నానబెట్టాలి. మరునాడు ఆ కొర్రలను అదే నీటితో పొయ్యి మీద పెట్టి అరగంట సేపు పొయ్యి మీద చిన్న మంట మీద ఉడకబెట్టాలి. తరువాత పొయ్యి ఆఫ్ చేసి ఆ పాత్ర పైన ఒక పలుచటి కాటన్ క్లోత్ ను కట్టాలి. ఇలా ఆరుగంటలు ఉంచిన తరువాత ఆ ఉడికిన కొర్రలలో పెరుగును బాగా కలిపితే కొర్రలతో చేసిన జావ రెడీ అయినట్లే.

కొర్రలను దోరగా వేయించి పొడి చేసుకొని దానితో కూడా జావ తయారుచేసుకోవచ్చు. ఈ విధంగా జొన్నలు, సజ్జలు, అరికెలు, సామలు వంటి వాటితో కూడా జావలను తయారుచేసుకోవచ్చు.

————————————————————-

బియ్యప్పిండి తో కూడా జావ చేసుకొని తాగొచ్చు. బియ్యప్పిండి జావకు కావలసిన పదార్థాలు:-

* ముడిబియ్యం పిండి రెండు స్పూన్లు
* నీరు 1 1/2 కప్పు
* ఉప్పు తగినంత
* మజ్జిగ అరకప్పు
* ఉల్లిపాయలు సన్నగా తరిగినవి
* పచ్చిమిర్చి సన్నగా తరిగినవి

ఒక కప్పు ముడిబియ్యాన్ని తీసుకొని నాలుగు గంటలు నానబెట్టాలి తరువాత దానిని నీడలో ఆరబెట్టాలి. అలా ఆరబెట్టిన బియ్యాన్ని దోరగా వేయించుకొని దానిని మిక్సి లో మెత్తగా పిండి పట్టాలి. ఇలా మనం చేసుకున్న బియ్యంపిండిని రెండు స్పూన్లు తీసుకోవాలి. దానిని ఒక గిన్నెలో అరకప్పు నీటిని తీసుకొని దానిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో ఒక కప్పు నీటిని తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని మరిగించాలి. మరిగిన తరువాత మనం కలుపుకున్న బియ్యంపిండిని వేసి దగ్గరగా వచ్చే వరకు కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తరువాత మజ్జిగ కలుపుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని తాగితే బియ్యంజావ చాలా బాగుంటుంది.

——————————————————————–

రాగి జావ అన్నిటికంటే ఉత్తమం. అలాగే రాగిజావను ఏ కాలంలో అయినా తాగొచ్చు. ముఖ్యంగా షుగర్ పేషంట్స్ రాగి జావా తాగితే మంచిది. ఇటీవల చాలా మంది ఉదయాన్నే వ్యాయామం తర్వాత రాగిజావ తాగుతున్నారు.

రాగి జావ తయారీకి కావలసిన పదార్థాలు:-

* రాగిపిండి ఒక కప్పు
* ఉప్పు తగినంత
* నీళ్ళు 5 కప్పులు
* పెరుగు అరకప్పు
* పచ్చిమిర్చి సన్నగా తరిగినవి మూడు
* ఉల్లిపాయలు సన్నగా తరిగినవి రెండు
* కొత్తిమీర కొద్దిగా
* కరివేపాకు కొద్దిగా
* అల్లం కొద్దిగా తీసుకొని చిన్న ముక్కలు చేసుకోవాలి

రెండు కప్పుల నీటిని తీసుకొని దానిలో రాగిపిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దానిలో తగినంత ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. కొంతసమయం తరువాత అది ముద్ద లాగా తయారవుతుంది. దానిలో మూడు కప్పుల నీటిని కలపాలి. ఆ తర్వాత పెరుగును చిలికి దీనిలో కలుపుకోవాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా రాగిజావను తయారుచేసుకోవచ్చు. ఇలా రకరకాల జావలు మన ఇంట్లోనే తయారుచేసుకొని తాగి ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.

 

Also Read : Chest Pain: ఛాతిలో నొప్పిగా ఉందా.. అయితే ఛాతీ నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే..!