నాన్ వెజ్ లలో చికెన్,మటన్ లివర్ అంటే ఇష్టపడని వారు ఉండరు. లివర్ కర్రీ చేస్తే లొట్టలు వేసుకుని మరి తినేస్తూ ఉంటారు. కొంతమంది వీటిని కాల్చుకొని కూడా తింటూ ఉంటారు. నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు తప్పనిసరిగా లివర్ ని కూడా తెచ్చుకొని తింటూ ఉంటారు. అయితే ఈ లివర్ తినడం మంచిదేనా?లివర్ ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చికెన్ లివర్ విషయానికి వస్తే.. చికెన్ లివర్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణంలో ఎంతగానో తోడ్పడుతుంది. చికెన్ లివర్ లో పోషకాలు కూడా ఉంటాయి. సెలీనియం, ఐరన్, విటమిన్ బి12, ఫోలెట్, విటమిన్ ఏ ఉంటాయి. చికెన్ లివర్ లో ఉండే సెలినియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆస్తమా, ఇన్ఫెక్షన్లు, శరీరంలో మంట, కీళ్ల నొప్పులు, శ్వాసకోస సమస్యలను తగ్గించడంలో సెలీనియం ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. మెదుడు చురుగ్గా పని చేసేందుకు విటమిన్ బి12 దోహదపడుతుందని చెబుతున్నారు. చికెన్ లివర్ రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుతుంది. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాకుండా బ్రెయిన్ డెవలప్‌మెంట్, కంటి చూపు పెరిగేందుకు సహాయపడుతుంది. చికెన్ లివర్ లో ఉండే ఫోలెట్ లైంగిక శక్తిని పెంపొందిస్తుందట. చికెన్ లివర్ ను ఉడికించి తింటే కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరిగేందుకు అవకాశం ఉండదట.
మటన్ లివర్ వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. మటన్ లివర్‌ని కూడా చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. మటన్ లివర్ ఫ్రై, మటన్ లివర్ గ్రేవీ కర్రీ, మటన్ లివర్ రోస్ట్ వంటి వంటకాలు చేసుకుని తింటారు. మటన్ లివర్ లో విటమిన్లు, పొటాషియం, ఇనుము, రాగి, జింక్ వంటివి ఉన్నాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించి శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఉపయోగపడుతుందట. ఇందులో విటమిన్లు ఎ,డి,బీ అధికంగా ఉంటాయి. మటన్ లివర్ లో ఉండే విటమిన్ ఎ కళ్లు, చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. ఇందులో ఉండే ఖనిజాలు ఎంజైమ్ లు పనితీరు మెరుగుపరిచి రసాయన ప్రక్రియలను సమతుల్యం చేస్తాయని చెబుతున్నారు. మటన్ లివర్ లో ఉండే విటమిన్ బి12 రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందట. అంతేకాకుండా నరాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
చికెన్, మటన్ లివర్ ఈ రెండు ఆరోగ్యానికి మంచివే. అయితే ఈ రెండింటిలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్ సమస్యలు, ఫ్యాటీ లివర్ తో బాధపడేవారు వీటికి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందట. అందుకే ఇలాంటి వారు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అంతేకాకుండా కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు వైద్యుల్ని సంప్రదించి తినడం మంచిదని చెబుతున్నారు.