Health Tips: చిప్స్ అనే మాట విన్నగానే చాలామంది నోరూరిపోతారు, ముఖ్యంగా పిల్లలు. ఇంట్లో తయారైన ఆహారం కంటే చిప్స్‌ను ఎక్కువగా తింటారు. అప్పుడప్పుడు తింటే పర్లేదు కానీ , తరచుగా తింటుంటే ఆ అలవాటును మానించడం మంచిదని ప్రఖ్యాత న్యూట్రిషనిస్టులు పేర్కొన్నారు. చిప్స్‌ను తరచూ తినడం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే, ఈ అలవాటును ఎలా మాన్పించాలో మరియు అది ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తుందో ఈ కథలో తెలుసుకుందాం.
సాధారణంగా చిప్స్‌ను రెండు విధాలుగా తయారు చేస్తారు. ఒకటి బంగాళాదుంప (Aloo), అరటి వంటి పదార్థాలతో, మరొకటి పిండితో తయారుచేస్తారు. వీటిని ఎక్కువగా ఆయిల్‌లో వేయిస్తారు. ఇంట్లో చేసిన చిప్స్ కాస్త బాగుంటాయి, కానీ బయట దొరికే స్నాక్స్‌లో రకరకాల మసాలాలు, కారప్పొడులు, ఉప్పు వంటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఉపయోగించడం వలన తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది, అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కంటి చూపు కోల్పోవడానికి అవకాశం ఉంది:
చిప్స్ తినిన పిల్లలకు వెంటనే పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది, దీంతో వారు వేరే ఆహారం తినాలని అనుకోరు. అయితే, మీ పిల్లలు ఎక్కువగా చిప్స్ తింటున్నారు అంటే, ఈ విషయాలు తెలుసుకోవడం అత్యంత అవసరం.
చిప్స్‌లో క్యాలరీలు అధికంగా ఉండడం ఒక ముఖ్యమైన అంశం. వీటితో పిల్లలకు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందవు. ఈ కారణంగా ఐరన్, జింక్, విటమిన్-ఎ, సి లోపాలను కలిగి ఉండొచ్చు. అంతేకాకుండా, త్వరగా అలసిపోవడం, అనారోగ్యానికి బలమైన ప్రతిబంధకాలు ఏర్పడడం, చివరికి కంటి దృష్టి కోల్పోవడం వంటి సమస్యలు కూడా రావొచ్చు.
కాబట్టి, మీ పిల్లలు చిప్స్ ఎక్కువగా తింటున్నట్లయితే, వెంటనే ఈ అలవాటును మాన్పించడం మంచిదని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.
చిప్స్ తినే అలవాటును ఎలా తగ్గించాలి?
పిల్లలు ఒక్కసారిగా చిప్స్ తినడం మానడం కష్టం. అందుకే, నెమ్మదిగా వారితో మానిపించేందుకు ప్రయత్నించాలి.
వారం పదిరోజులకోసారి చిప్స్ ఇచ్చి, అవి ఎక్కువగా తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి వారికి వివరించాలి. అలాగే, పిల్లల రోజువారీ భోజనంలో నూనె, పప్పు గింజలు, తృణధాన్యాలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, అన్ని పండ్లను తప్పనిసరిగా తినేలా చూడాలి.
ఇలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటుగా చేసుకుంటే, పిల్లలు క్రమంగా చిప్స్ అడగడం మానేస్తారని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.