Rice: మనలో చాలామంది రోజుల్లో మూడు పూటలా అన్నం తింటూ ఉంటారు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉదయాన్నే పనులకు వెళ్లేవారు అన్నం ఎక్కువగా తింటూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఉదయాన్నే లేదా రాత్రిళ్ళు టిఫిన్ లేదా రొట్టె ముద్ద వంటివి తింటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన రావడంతో మూడు పూటలా అన్నం తినడం మానేశారు. బదులుగా ఒక పూట చపాతీ ముద్ద రొట్టె వంటివి తింటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో మూడు పూటలా అన్నం తినడం అసలు మంచిది కాదని చెబుతున్నారు. మరి రోజులో మూడు పూటలా అన్నం తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మన ఆహారంలో అన్నానికి ప్రత్యేక స్థానం ఉంది. అన్నం మన శరీరానికి శక్తినిచ్చే ప్రధాన కార్బోహైడ్రేట్. ముఖ్యంగా వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి. రోజుకు మూడు పూటలా కేవలం అన్నమే తింటే మన శరీరానికి శక్తి లభించినా, సమతుల ఆహారం అందదట. దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయట. అధిక కార్బోహైడ్రేట్లు శరీరంలో గ్లూకోజ్‌గా మారి కొవ్వుగా పేరుకుపోతాయట. దానివల్ల ఊబకాయం వస్తుందని, బరువును అదుపులో ఉంచుకోవాలంటే అన్నం తినడం తగ్గించాలని చెబుతున్నారు. రోజుకు మూడు సార్లు అన్నం తింటూ వ్యాయామం చేయకపోతే, శరీరంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగి పొట్ట భాగంలో ఫ్యాట్ పేరుకుపోతుందట.
వైట్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుందని, అంటే అది తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెంచేస్తుందని చెబుతున్నారు. దీని ఫలితంగా డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుందట. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు రోజూ మూడు పూటలా వైట్ రైస్ తినకపోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు. వైట్ రైస్ ఎక్కువగా తినడం కూడా గుండె ఆరోగ్యానికి మంచిది కాదట. దీంట్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె సమస్యలకు దారితీస్తుందట. అంతేకాదు ఫైబర్ లేమి వల్ల జీర్ణ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయదని, దానివల్ల మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా అన్నం తిన్న వెంటనే శక్తి వస్తుంది కానీ అది ఎక్కువసేపు ఉండదట. వైట్ రైస్ త్వరగా గ్లూకోజ్ గా మారిపోతుంది.
దానివల్ల వెంటనే ఆకలి వేస్తుందని, ఫలితంగా మళ్లీ ఏదో ఒకటి తినాలి అనిపిస్తుందని, అంతేకాదు అన్నం తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి వేగంగా పెరుగుతుందని, ఒకవేళ ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్య ఉంటే వైట్ రైస్ తినకపోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు. మన శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అన్నీ సరైన మోతాదులో అవసరం. కానీ అన్నంలో ఇవి చాలా తక్కువట. కాబట్టి కేవలం అన్నమే తింటే శరీరానికి కావాల్సిన ఐరన్, కాల్షియం, విటమిన్ B12, విటమిన్ D వంటి ముఖ్య పోషకాలు అందవట. దీని వల్ల బలహీనత, అలసట, రక్తహీనత, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు వస్తాయని, ప్రతిరోజూ వైట్ రైస్ తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు. కాబట్టి మూడు పూటలా అన్నమే తినకుండా ఒక పూట చపాతీ లేదా ఏదయినా టిఫిన్స్, రొట్టె, ముద్ద వంటివి తినడం మంచిదని చెబుతున్నారు..
Rice: ప్రతీరోజూ 3 పూటలా అన్నం తింటున్నారా? అయితే ఇది మీకోసమే!

Rice