Site icon HashtagU Telugu

Legs Position : కాలిమీద కాలు వేసుకుని కూర్చుంటున్నారా ? ఎంత నష్టమో తెలుసా ?

legs position

legs position

Legs Position : మన ఆరోగ్యం.. మనం కూర్చునే పద్దతిపై కూడా ఆధారపడి ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు ? కింద కూర్చున్నపుడు రెండుకాళ్లు మడిచి కూర్చోవడం చాలా మంచిదంటారు పెద్దలు. అలాగే చాలా మందికి ఒక కాలిపై మరొక కాలు వేసుకుని కూర్చోవడం అలవాటు. ఆఫీస్, రెస్టారెంట్లు, మెట్రోలో.. ఇలా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనిస్తే.. మీకు ఇదే కనిపిస్తుంది. మనకు తెలియకుండానే ఆ భంగిమలో కూర్చుంటాం. అందువల్ల జరిగే నష్టం గురించి మాత్రం ఎవరూ ఆలోచించరు.

కాలిమీద కాలు వేసుకుని కూర్చోవడం అంత ప్రమాదమా అంటే.. కాదు. కానీ.. ఈ అలవాటు మీకు అనారోగ్య సమస్యల్ని మరింత పెంచుతుంది. రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. మోకాలి సమస్యలు, తిమ్మిర్లు రావొచ్చు. గర్భిణి స్త్రీలు కూడా ఈ భంగిమలో కూర్చోవడం మంచిది కాదు. ఎందుకంటే జనన సంబంధిత సమస్యలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ నర్సింగ్ అండ్ జర్నల్ ఆఫ్ హైపర్ టెన్షన్లో ప్రచురితమైన 2 అధ్యయనాలు కాలిమీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల మీ రక్తపోటులో స్వల్ప పెరుగుదల వస్తుందని కనుగొన్నారు. మోకాలిపై మరో కాలిని వేసినపుడు రక్తపోటులో కొంచెం స్పైక్ ఉంటుంది. ఇది తాత్కాలికంగానే ఉందన్న విషయాన్ని గమనించాలి.

కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల నరాల్లో వాపు, నొప్పి వచ్చే అవకాశాలున్నాయని అంటారు. నిజానికి సిరల్లోని కవాటాల్లో కొన్ని సమస్యలున్నపుడు ఎడెమో, వెరికోస్ వీన్స్ వంటివి వస్తాయి. గుండెకు రక్తాన్ని పంప్ చేసేందుకు శారీరక శ్రమ అవసరం. ఈ స్థితిలో సిరల్లో వాపు వస్తుంది. ఎక్కువసేపు కూర్చొంటే లేదా నిలబడేవారికి మాత్రం వెరికోస్ వీన్స్ వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ఈ భంగిమకు సంబంధం లేదు.

మోకాళ్ల నొప్పుల విషయానికొస్తే.. ఇవి గాయం, కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య పరిస్థితి వల్ల రావొచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రమే కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల మోకాలి లేదా కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మీకు మోకాలి సంబంధిత సమస్యలున్నట్లైతే.. నిర్థిష్టమైన భంగిమలో ఎక్కువసేపు కూర్చోకూడదు. అది మీ సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. అలాగే ఆఫీసుల్లో పనిచేసేవారు గంటల తరబడి ఒకే సీటులో కూర్చోకూడదు. మధ్యలో లేచి అటూ ఇటూ కాస్త నడవడం మంచిది.