మనకు వేసవికాలంలో దొరికే పండ్లలో నేరేడు పండ్లు కూడా ఒకటి. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. వీటివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నేరేడు పండ్లతో పాటు వాటి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నేరేడు పండ్లను తరచుగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఇవి మధుమేహం ఉన్నవారికి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. రక్తంలో పెరిగిన షుగర్ లెవల్స్ ని ఎప్పటికప్పుడు నియంత్రించడంలో ఇవి ఎంతో బాగా పనిచేస్తాయి.
నేరేడు పండు తక్కువ గ్లైసెమిక్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుందట. మధుమేహం వల్ల వచ్చే అధిక మూత్ర విసర్జన దాహాన్ని నియంత్రించడంలో కూడా నేరేడు పండు సహాయపడుతుందట. ఈ రోజుల్లో చాలా మంది బలహీనమైన రోగనిరోధక శక్తితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అలాంటి వారు రోగనిరోధక శక్తిని పెంచడానికి అనేక పనులు చేస్తుంటారు. అలాంటివారికి నేరేడు పండు బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. ఇందులో శరీర రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయట. దీనితో పాటు, సోడియం, కాల్షియం, ఇనుము, కార్బోహైడ్రేట్లు నేరేడు పండ్లలో కనిపిస్తాయని చెబుతున్నారు.
మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటైన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో నేరేడు పండు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందట. పొటాషియం ఇందులో పుష్కలంగా ఉంటుందట. ఇది సాధారణ హృదయ స్పందనను నిర్వహించడానికి సహాయపడుతుందని, మీరు మీ గుండెని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే క్రమం తప్పకుండా నేరేడు పండు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని, పొటాషియం అధిక రక్తపోటు వల్ల వచ్చే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా నేరేడు పండులో లోపల కనిపిస్తాయట. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్ కణాలతో పోరాడడంలో సహాయపడతాయట. నేరేడులో ఉండే సైనిడిన్ పెద్దప్రేగు క్యాన్సర్ ను నివారించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.