Site icon HashtagU Telugu

Green Gram : పెసర్ల వల్ల కలిగే లాభాలు తెలుస్తే…అస్సలు వదిలిపెట్టరు..!!

Green Beans Scaled

Green Beans Scaled

మనం ప్రతిరోజూ తినే ఆరోగ్యకరమైన ఆహారాల్లో పెసలు ఒకటి. మొలకెత్తించి కూడా వీటిని తినవచ్చు. గుగ్గిళ్ల రూపంలోనూ తినవచ్చు. ఎలా తిన్నా మనకు పెసల వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు వీటిలో ఉన్నాయి. ప్రతిరోజూ పెసలు తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

* పెసలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్, ఫొలేట్, మాంగనీస్, విటమిన్ బి1, పాస్పరస్, ఐరన్, కాపర్, పొటాషియం, జింక్, విటమిన్ బి2,బి3,బి5, బి6, సెలీనియంలు పుష్కలంగా లభిస్తాయి. వీటితో మనకు పోషణ చక్కగా అందుతుంది. పెసర్లలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఐరన్ రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. పొటాషియం గుండెసంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది.

* వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికమోతాదులో ఉంటాయి. మన శరీరరోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. దీంతో మనకు వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా సీజన్ మారే సమయంలో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధుల నుంచి రక్షణగా ఉంటుంది.

* పెసర్లను తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల్లో ముఖ్యమైంది ఏంటంటే…రక్తంలో ఉండు చెడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీంతో అధిక బరువుతో బాధపడేవారు బరువు తగ్గుతారు. గుండె సంబంధిత రోగాలు రావు. ఈ విషయం సైంటిస్టులు నిర్వహించిన పరిశోధనల్లోనూ తేలింది.

* ఇవే కాదు పెసర్లను క్రమంతప్పకుండా తీసుకున్నట్లయితే…రక్త సరఫరా మెరుగుపడుతుంది. హైబీపీ కంట్రోల్లో ఉంటుంది. రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి. గుండెజబ్బులు రాకుండా ఉంటాయి.

*ఇక డయాబెటిస్ ఉన్నవాళ్లు పెసర్లను నిత్యం ఆహారంలో తీసుకోవాలి. ఇలా చేస్తే షుగర్ అదుపులో ఉంటుంది. గర్భిణీలు కూడా పెసర్లను తింటే ఫొలేట్ బాగా అందుతుంది. బిడ్డ ఎదుగుదలకు సహాయపడుతుంది.