Site icon HashtagU Telugu

Betel: పరగడుపున తమలపాకు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Betel

Betel

తమలపాకు.. వీటిని హిందువులు తాంబూలంగా అలాగే దేవుడికి ఆకు పూజ కట్టడానికి ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. వాటితో పాటుగా పాన్, వక్కాకు వేసుకోవడానికి తమలపాకులను వినియోగిస్తూ ఉంటారు. వీటికి మాత్రమే కాకుండా తమలపాకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చాలామంది భోజనం తర్వాత తమలపాకును వేసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మరి అటువంటి తమలపాకును ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఉదయాన్నే తమలపాకును ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తగ్గిపోతాయి. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి. ప్రతిరోజు ఉదయాన్నే తమలపాకును తినడం వల్ల పోషకాల లోపాలను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా తమలపాకులు పేగులకు ఎంతో మంచి చేస్తాయి. వీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా సోకవు. అంతేకాకుండా తమలపాకు అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే తమలపాకును పేస్టులా చేసి గాయాలు, వ్యాధి సోకిన ప్రదేశంలో పూయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గి నొప్పి కూడా తగ్గుతుంది. కీళ్ల నొప్పితో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఖాళీ కడుపుతో తమలపాకుని తీసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తమలపాకుల్లో ఉండే యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు కీళ్లనొప్పిని తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి.

అదేవిధంగా ప్రతిరోజు తమలపాకును నమలడం వల్ల నోట్లో పంటి నొప్పి, చిగుళ్ల వాపు,ఇన్ఫెక్షన్స్ వంటివి తగ్గి మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. చాలామంది చలికాలంలో మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఖాళీ కడుపుతో తమలపాకును నమలడం వల్ల గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలను పరిష్కరించడంలో ఎంతో బాగా సహాయపడుతుంది. తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మన శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకుల రసాన్ని మాత్రమే తీసుకోవాలి.