గోరుచిక్కుడు.. ఈ కూరగాయని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. మొటిక్కాయలు, చూలే కాయలు, చౌడే కాయలు.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే మనలో చాలామంది వీటిని తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఏం గోరుచిక్కుడు వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం వీటిని తినకుండా అసలు ఉండలేరని చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటి అన్న విషయానికి వస్తే..
గోరు చిక్కుడు కాయ డైటరీ ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలకు అద్భుతమైన మూలం. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కూరగాయల్లో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, జింక్ తో సహా ఎన్నో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. గోరు చిక్కుడులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి లేదా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి మంచి ఆహారం అని చెప్పాలి.
ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందట. గోరు చిక్కుడు డైటరీ ఫైబర్ కు అద్భుతమైన మూలం. ఇది జీర్ణక్రియను మందగించడానికి, రక్తప్రవాహంలోకి చక్కెర శోషణకు సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలను నివారించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా గోరు చిక్కుడులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుందని చెబుతున్నారు.
అలాగే ఇది మలబద్ధకం,ఇతర జీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. కాగా గోరు చిక్కుడులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఫైబర్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి మీరు అతిగా తినరు.