H3N2 Alert: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త వైరస్ విస్తరిస్తోంది. ఇన్‌ఫ్లుఎంజా ఏ వైరస్‌లోని ఒక రకమైన H3N2 వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వల్ల వచ్చే H3N2 ఫ్లూ సాధారణ జ్వరం కంటే తీవ్రంగా ఉంటుంది. దీని ప్రభావం వల్ల చాలామంది ఆసుపత్రిలో చేరాల్సి వస్తోంది. అందుకే ఈ ఫ్లూ ప్రారంభ లక్షణాలను గుర్తించడం చాలా అవసరం. ఈ ఫ్లూ ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? దానిని ఎలా నివారించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
H3N2 అంటే ఏమిటి?
H3N2 అనేది ఇన్‌ఫ్లుఎంజా ఏ వైరస్‌లోని ఒక ఉపరకం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. H3N2 వల్ల వచ్చే జ్వరం సాధారణంగా కనిపించే జ్వరం కంటే తీవ్రంగా ఉంటుంది. ఇది ఇతర ఫ్లూల కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తరచుగా మ్యుటేట్ అవుతూ (రూపాంతరం చెందుతూ) కొత్త రకాలను ఏర్పరుచుకుంటుంది.
H3N2 లక్షణాలు
H3N2 వైరస్ సోకిన 1 నుండి 4 రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపించవచ్చు
- తీవ్రమైన జ్వరం
- నిరంతర దగ్గు
- గొంతు నొప్పి లేదా గొంతు మూసుకుపోవడం
- ముక్కు దిబ్బడ లేదా ముక్కు కారడం
- శరీర నొప్పులు
- కండరాల నొప్పులు
- తలనొప్పి
- బలహీనంగా అనిపించడం
- నిరంతర అలసట
- పిల్లలలో వాంతులు, వికారం
H3N2 వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
H3N2 చాలా వేగంగా వ్యాపిస్తుంది. దగ్గడం, తుమ్మడం లేదా మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అంతేకాకుండా ఏదైనా ఉపరితలంపై వైరస్ ఉండి దానిని తాకిన తర్వాత ముఖాన్ని లేదా నోటిని తాకడం వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది.
Also Read: Transfers of IPS : ఏపీలో IPSల బదిలీలు.. ఈ జిల్లాలకు కొత్త ఎస్పీలు
ఈ వైరస్ ఎవరికి ప్రమాదకరం?
H3N2 వైరస్ పిల్లలకు, పెద్దలకు, గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదకరం. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది మరింత త్వరగా సోకుతుంది. ఈ వర్గాల వారికి ఈ ఫ్లూ వస్తే అది న్యుమోనియా, బ్రోంకైటిస్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.
H3N2 నుండి ఎలా రక్షించుకోవాలి?
- H3N2 ఫ్లూ నుండి రక్షించుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.
- WHO ప్రకారం ప్రతి సంవత్సరం ఫ్లూ టీకా తీసుకోవడం వల్ల సీజనల్ ఫ్లూల నుండి దూరంగా ఉండవచ్చు.
- ఏదైనా ఉపరితలాన్ని తాకిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి. కనీసం 20 సెకన్ల పాటు సబ్బు, నీటితో చేతులను బాగా రుద్దుకోవాలి.
- తరచుగా మీ ముఖాన్ని తాకడం మానుకోండి. తుమ్మేటప్పుడు చేతులకు బదులుగా టిష్యూ లేదా మోచేతిని ఉపయోగించండి.
- ఆరోగ్యం బాగాలేదని అనిపిస్తే ఇతరులకు సోకకుండా ఉండటానికి ఇంట్లోనే ఉండటం మంచిది.
H3N2 ఫ్లూ నుండి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది?
ఈ ఫ్లూ నుండి పూర్తిగా కోలుకోవడానికి ఒక వారం పట్టవచ్చు. ఈ సమయంలో మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. మందులను సమయానికి తీసుకోవాలి. లక్షణాలు కొన్ని రోజుల్లో తగ్గకపోతే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మైకం, ఛాతీలో తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు ఎదురైతే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.