GB Syndrome Symptoms : ‘గిలైన్ బారె సిండ్రోమ్’ (Guillain-Barre Syndrome) మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. దీని బారినపడి సోలాపుర్ జిల్లాలో ఓ వ్యక్తి చనిపోయాడు. అతడి మరణానికి జీబీఎస్ (గిలైన్ బారె సిండ్రోమ్) కారణమని వైద్యవర్గాలు అనుమానిస్తున్నాయి. రాష్ట్రంలోని పూణేలో నమోదైన జీబీఎస్ కేసుల సంఖ్య 101కి పెరిగింది. ఈ బాధితుల్లో 16 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. జీబీఎస్ లక్షణాలతో చనిపోయిన సోలాపూర్ వాస్తవ్యుడు కూడా పూణేలోనే చికిత్స పొందాడు. జీబీఎస్ వ్యాధి చికిత్స ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ చికిత్స పొందే క్రమంలో తీసుకోవాల్సిన ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఒక్కో దాని ధర వేలల్లో ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం సర్కారీ ఆస్పత్రుల్లో ఉచితంగా జీబీఎస్ చికిత్సను అందిస్తోంది. ఇంతకీ ఏమిటీ ‘గిలైన్ బారె సిండ్రోమ్’. ఇది సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు బయటపడతాయి ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :YS Jagan : జగన్‌కు ఊరట.. అక్రమాస్తుల కేసుల బదిలీకి ‘సుప్రీం’ నో.. రఘురామ పిటిషన్ వెనక్కి
ఏమిటీ ‘గిలైన్ బారె సిండ్రోమ్’ ?
- ‘గిలైన్ బారె సిండ్రోమ్’ (GBS) అనేది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి(GB Syndrome Symptoms).
- ఈ వ్యాధి వచ్చిన వారికి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థే శత్రువుగా మారుతుంది. అది శరీరంలోని నరాలపై దాడి చేస్తుంది. దీనివల్ల నరాలు వీక్ అవుతాయి. ఫలితంగా శరీరంలో తిమ్మిర్లు పెరుగుతాయి. క్రమంగా పక్షవాతం వచ్చే రిస్క్ ఉంటుంది.
- జీబీఎస్ వ్యాధి ఎందుకు వస్తుంది ? అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
- ఈ వ్యాధి రావడానికి కనీసం ఆరువారాల ముందు నుంచే శరీరంలో లక్షణాలు బయటపడతాయి.
- జీబీఎస్ వ్యాధి ముందస్తు లక్షణాలు ఈకింది విధంగా ఉంటాయి.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
- గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ రావచ్చు.
- ఆరోగ్యపరంగా చాలా బలహీనం అవుతారు. బలహీనత అనేది తొలుత పాదాల్లో, కాళ్లలో కనిపిస్తుంది.
- కాళ్ల భాగం నుంచి శరీరంలోని ఇతరత్రా భాగాల వైపుగా బలహీనత పెరుగుతూపోతుంది.
- చేతులు, మొహం, ఊపిరితిత్తుల దాకా బలహీనత వ్యాపిస్తుంది.
- మెట్లు ఎక్కడం కూడా కష్టతరం అయ్యేంత స్థాయిలో ఊపిరితిత్తులు బలహీనపడతాయి.
- మొహం పాలిపోయినట్లుగా తయారవుతుంది.
- నరాలు దెబ్బతినడం వల్ల మెదడుకు అసాధారణ సెన్సరీ సిగ్నల్స్ అందుతాయి. ఆ సిగ్నల్స్ మెదడు నియంత్రణలో ఉండవు.
- పై లక్షణాలన్నీ బయటపడిన తర్వాత జీబీఎస్ రోగికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు పెరుగుతుంది.
- చేతులు, కాళ్లలో నొప్పులు పెరుగుతాయి. ఈ నొప్పులు రాత్రిటైంలో బాగా పెరుగుతాయి.
- గుండె కొట్టుకునే రేటు, బీపీ అసాధారణంగా పెరుగుతాయి.
- మూత్రాశయ సమస్యలు మొదలవుతాయి.
- శరీరాన్ని పరీక్షించి, వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే జీబీఎస్ సమస్యపై వైద్యులు నిర్ధారణకు వస్తారు.
- ప్రస్తుతానికి జీబీఎస్ వ్యాధికి నిర్దిష్ట వైద్య చికిత్స లేదు. దాని తీవ్రతను తగ్గించుకునే తాత్కాలిక చికిత్సా మార్గాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
- చికిత్స ఒకవేళ అనుకూలిస్తే కొన్ని వారాల్లోనే రోగి కోలుకునే అవకాశం ఉంటుంది.
- ఒకవేళ చికిత్స అనుకూలించకుంటే కొన్ని సంవత్సరాల పాటు ఈ వ్యాధితో బాధపడాల్సి వస్తుంది.