పచ్చిమిర్చి అనగానే వామ్మో కారం అని అంటుంటారు. కొందరు పచ్చిమిర్చి ని పచ్చిగా తినడానికి ఇష్టపడితే మరి కొందరు కూరల్లో వేసిన పచ్చిమిరపకాయలను కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి చాలా కారంగా ఉంటాయి. ఇవి కారంగా ఉన్నప్పటికీ ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని చెబుతున్నారు.. ముఖ్యంగా పచ్చిమిర్చిని పచ్చిగా తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చట. మరి పచ్చిమిర్చిని పచ్చిగా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పచ్చిమిర్చిలో విటమిన్ ఏ, సి ఉంటాయి.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తాయట. అలాగే స్కిన్ కి కూడా మంచి ప్రయోజనాలు అందిస్తాయని, వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలు పాడుకాకుండా హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు. అలాగే పచ్చిమిర్చి మెటబాలిజంను పెంచుతుందట. జీర్ణ క్రియ కూడా ఫాస్ట్ గా జరుగుతుందట. దాంతో తిన్నది జీర్ణమయ్యి బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన పద్ధతిలో ఫ్యాట్‌ని తగ్గిస్తుందట. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు పచ్చిమిర్చిని తమ డైట్లో చేర్చుకోవచ్చని చెబుతున్నారు. అలాగే పచ్చిమిర్చి నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తుందట. పచ్చిమిర్చి లోని క్యాప్సైసిన్ మెదడుకు నొప్పిని తీసుకువెల్లే సంకేతాలను నిరోధించి నొప్పిని త్వరగా తగ్గేలా చేస్తుందట.
అదేవిధంగా పచ్చిమిర్చి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయట. సహజంగానే గట్ సమస్యలు దూరమవుతాయట. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటకు పంపడంలో పచ్చిమిర్చి ముఖ్యపాత్ర పోషిస్తాయట. ఇవి గుండె సమస్యలను తగ్గించి గుండెకు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే చలికాలంలో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు డైట్ లో పచ్చిమిర్చిని చేర్చుకోవడం వల్ల ముక్కుదిబ్బడ వంటి సమస్యలను తొలగించుకోవచ్చట. పచ్చిమిర్చి ముక్కు రంధ్రాలు మూసుకోకుండా చేసి గాలి బాగా ఆడేలా హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు.