Site icon HashtagU Telugu

Patanjali Ads : ‘‘ఎంత ధైర్యం.. వద్దన్నా తప్పుడు యాడ్సే ఇస్తారా?’’ పతంజలికి సుప్రీం చివాట్లు

Patanjali Ads

Patanjali Ads

Patanjali Ads : ‘పతంజలి ఆయుర్వేద’ మీడియాలో ప్రచారం చేస్తున్న యాడ్స్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.  ‘పతంజలి ఆయుర్వేద’  ఉత్పత్తులతో అనేక వ్యాధులు నయం అవుతాయనే ప్రచారం చేసుకోవడం సరికాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.  ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని గత ఏడాది నవంబర్‌లో తాము హెచ్చరించినా పెడచెవిన పెట్టినందుకు ‘పతంజలి ఆయుర్వేద’‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పతంజలి ఇష్టానుసారంగా ప్రచారం చేసుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకొని కూర్చుంటోంది’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

We’re now on WhatsApp. Click to Join

ఆంగ్ల వైద్యానికి వ్యతిరేకంగా పతంజలి జారీ చేసిన యాడ్స్‌పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో గతేడాది పిటిషన్ దాఖలు చేసింది. అప్పట్లో 2023 నవంబర్ 29న ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. అలోపతి, మందులు, టీకాల విషయంలో బాబా రామ్‌దేవ్‌ కంపెనీ ఇచ్చిన యాడ్స్‌ను ఖండించింది. అల్లోపతి వర్సెస్ ఆయుర్వేదం అనే చర్చకు తావిచ్చేలా యాడ్స్ ఉండకూడదని కోర్టు పేర్కొంది.  ఇదే కేసుపై మంగళవారం విచారణ సందర్భంగా.. పత్రికల్లో పతంజలి ఆయుర్వేద ఇస్తున్న యాడ్స్‌ను చూపించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా స్వయంగా వార్తాపత్రికతో కోర్టుకు వచ్చారు. వార్తాపత్రికలోని పతంజలి యాడ్‌ను(Patanjali Ads) చూపిస్తూ..  కోర్టు ఆదేశాలను పతంజలి ధిక్కరించిన తీరును న్యాయమూర్తి వివరించారు. కోర్టును రెచ్చగొట్టేలా పతంజలి ఆయుర్వేద వ్యవహరిస్తోందని జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా వ్యాఖ్యానించారు. తప్పుదోవ పట్టించే మెడికల్ ప్రకటనలను నిలువరించడానికి ప్రతిపాదనలు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Also Read : Electric Car: అరగంటలోనే ఫుల్ ఛార్జ్.. ఒక్క ఛార్జ్ తో 570 కిలోమీటర్ల ప్రయాణం?

అల్లోపతి మందులు, వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా పతంజలి ఆయుర్వేద జారీ చేసిన యాడ్స్‌పై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు..  రసాయన ఆధారిత ఔషధాల కంటే మంచివని ఎలా చెప్పగలదని బెంచ్ ప్రశ్నించింది. అల్లోపతికి వ్యతిరేకంగా పతంజలి ఆయుర్వేద ప్రకటనలు విడుదల చేయడం  సరికాదని స్పష్టం చేసింది. కోర్టు చెప్పిన తర్వాత కూడా  అలాంటి యాడ్స్‌నే ఎందుకు ప్రచారం చేస్తున్నారని పతంజలి ఆయుర్వేద సంస్థ నిర్వాహకులను కోర్టు నిలదీసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై భారీ జరిమానా విధిస్తామని పతంజలిని కోర్టు హెచ్చరించింది. ఒక నిర్దిష్ట వ్యాధిని నయం చేయవచ్చని తప్పుగా క్లెయిమ్ చేస్తే.. ఒక్కో పతంజలి ఉత్పత్తిపై కోటి రూపాయలు చొప్పున జరిమానా విధించడానికి కూడా వెనుకాడబోమని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

Also Read : PM Modi: కేర‌ళ‌లో బీజేపీకి రెండు అంకెల‌ సీట్లు వ‌స్తాయిః ప్ర‌ధాని మోడీ

Exit mobile version