Site icon HashtagU Telugu

Hypertension : ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు నియంత్రణకు కొత్త ఆన్‌లైన్ టూల్

Hypertension

Hypertension

Hypertension : భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన నిపుణులు కలసి ఒక వినూత్న ఆన్‌లైన్ ఆధారిత టూల్‌ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా రక్తపోటు (హైపర్‌టెన్షన్) చికిత్సలో కొత్త దారులు తెరుచుకోనున్నాయి. ఈ టూల్ సాయంతో వైద్యులు ప్రతి రోగికి సరైన మందుల కలయికను, మోతాదును ఎంచుకోవచ్చు. ముఖ్యంగా రోగికి ఎంత మేర రక్తపోటు తగ్గించుకోవాలన్నది బట్టి చికిత్స విధానం నిర్ణయించుకోవడానికి ఇది ఉపయోగపడనుంది.

‘బ్లడ్ ప్రెజర్ ట్రీట్మెంట్ ఎఫికసీ కాలిక్యులేటర్’ పేరుతో రూపొందించిన ఈ టూల్, దాదాపు 500 ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్‌ డేటా ఆధారంగా తయారైంది. ఈ ట్రయల్స్‌లో లక్షకు పైగా రోగులు పాల్గొన్నారు. ఈ డేటాను విశ్లేషించి, వేర్వేరు ఔషధాలు సగటున రక్తపోటును ఎంత మేర తగ్గిస్తాయో గుర్తించారు. వైద్యులు ఈ సమాచారం ఆధారంగా ప్రతి రోగికి సరైన మందులను ఎంచుకునే వీలుంటుంది.

Financial Rules: సెప్టెంబర్ 1 నుంచి మార‌నున్న ఆర్థిక నిబంధ‌న‌లు ఇవే!

హైదరాబాద్‌లోని జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్‌కి చెందిన డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ సలాం మాట్లాడుతూ, “హై బ్లడ్ ప్రెజర్ నియంత్రణ అత్యంత కీలకం. రోగి అవసరాన్ని బట్టి సరైన ఔషధాలు, వాటి మోతాదులు ఎంచుకోవడం కోసం ఈ టూల్ ఉపయుక్తం అవుతుంది. మార్గదర్శకాలు రక్తపోటు లక్ష్యాన్ని చెబుతాయి. కానీ ఆ లక్ష్యం చేరడానికి ఏ మందులు ఉపయోగపడతాయో మా ఆన్‌లైన్ సాధనం స్పష్టతనిస్తుంది” అని వివరించారు.

సాధారణంగా ఒకే రకమైన మందు వాడితే రక్తపోటు సిస్టాలిక్ రీడింగ్‌లో సగటున 8–9 mmHg మాత్రమే తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే చాలా రోగులు 15–30 mmHg వరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సరైన మందుల కలయిక ఎంచుకోవడం కీలకం.ఈ ఇనిస్టిట్యూట్‌లో కార్డియాలజిస్ట్, పరిశోధకుడు నెల్సన్ వాంగ్ మాట్లాడుతూ, “ఇప్పటి వరకు వైద్యులు రోగి రక్తపోటు కొలిచి, దానికి అనుగుణంగా మందులను మార్చడం చేస్తారు. కానీ రక్తపోటు కొలతల్లో చాలా వేరియేషన్లు రావడం వల్ల అది ఎల్లప్పుడూ నమ్మదగినది కాదు. ఈ కొత్త టూల్ వందలాది ట్రయల్స్‌లో కనిపించిన సగటు ఫలితాల ఆధారంగా రోగికి ఏ ఔషధం ఎంత వరకు ఉపయోగపడుతుందో చూపిస్తుంది” అన్నారు. ఈ టూల్ ఔషధాలను తక్కువ, మోస్తరు, అధిక తీవ్రత గల చికిత్సలుగా వర్గీకరిస్తుంది. ఇది ఇప్పటికే కొలెస్ట్రాల్ చికిత్సలో ఉపయోగించే విధానంతో సమానంగా ఉంటుంది. దీని వల్ల వైద్యులకు మందులు ఎంచుకోవడంలో మరింత స్పష్టత వస్తుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.3 బిలియన్ మందికి పైగా హై బ్లడ్ ప్రెజర్ సమస్య ఉంది. ప్రతి ఏడాది సుమారు పది మిలియన్ల మంది రక్తపోటుతో సంబంధిత వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. రక్తపోటు ఎటువంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధులు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అందుకే దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అని కూడా అంటారు. ప్రస్తుతం హైపర్‌టెన్షన్ ఉన్న వారిలో ఐదుగురిలో ఒకరే దాన్ని నియంత్రణలో ఉంచగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా అభివృద్ధి చేసిన ఆన్‌లైన్ టూల్, వైద్యులకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మార్గదర్శిగా నిలుస్తుందని, లక్షలాది ప్రాణాలను కాపాడే శక్తి దానికుందని నిపుణులు భావిస్తున్నారు.

Vishal – Dhanshika Engagement : అట్టహాసంగా హీరో విశాల్ నిశ్చితార్థం