Period Remedies : ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటే.. మనిషికి అనారోగ్యాలు దరిచేరవు. ఒత్తిడి, ఆందోళనతో పాటు మారిన ఆహారపు అలవాట్లు కూడా స్త్రీలలో రుతుక్రమం ఆలస్యంగా రావడానికి ప్రధాన కారణాలు. ఒత్తిడి పెరిగితే శరీరంలో కార్డిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది రుతుక్రమ చక్రం మార్పుకు కారణమవుతుంది. హార్మోన్ అసమతుల్యత వల్ల పీరియడ్స్ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. మితిమీరిన వ్యాయామాలు కూడా ఒక రీజన్ కావొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
అంతేకాదు.. థైరాయిడ్, అధిక బరువు ఉన్నవారిలోనూ హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ కామన్ గా ఉంటుంది. PCOS సమస్య ఉన్నవారు కూడా సమయానికి పీరియడ్స్ రాక ఇబ్బంది పడుతుంటారు. మీరు అనుకున్న డేట్ కంటే పీరియడ్స్ ముందుగా రావడానికి మందులు మింగే కంటే.. ఇంట్లోనే కొన్ని ఆహారాలను తినడం మేలు. అవేంటో చూద్దాం.
అందరి వంటింట్లో ఉండే ఆహార పదార్థం వాము. దీనిని బెల్లంతో కలిపి తింటే.. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి తీవ్రత తగ్గుతుంది. రోజూ ఉదయాన్నే.. ఒక గ్లాసు నీటిలో టీ స్పూన్ వాము, టీ స్పూన్ బెల్లం తురుమును వేసి మరిగించాలి. కాస్త గోరువెచ్చగా చల్లారిన తర్వాత తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగితే పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే ఛాన్స్ ఉంది.
వంటింట్లోనే ఉండే మరో దినుసు.. ధనియాలు. ధనియాలు కూడా పీరియడ్స్ త్వరగా రావడానికి సహాయపడుతాయి. 2 కప్పుల నీటిలో ఒక టీ స్పూన్ ధనియాలను వేసి.. చిన్న మంటపై మరిగించాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి గోరువెచ్చగా చల్లారాక తాగాలి. దీనిని రోజుకు 3 సార్లు తాగితే రుతుక్రమం త్వరగా వస్తుంది.
దానిమ్మను ఎక్కువగా తిన్నా, దానిమ్మ జ్యూస్ తాగినా రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చే అవకాశాలున్నాయి. 10-15 రోజులపాటు ఇలా చేస్తే.. నెలసరి త్వరగా వస్తుంది.
పీరియడ్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది బొప్పాయి. బొప్పాయిలో కెరోటిన్, ఈస్ట్రోజన్ హార్మోన్లను పెంచే గుణం ఉంటుంది. అందుకే రోజూ బొప్పాయి తింటే.. రుతుక్రమం రెగ్యులర్ అవుతుంది. రోజుకు 2 సార్లు తిన్నా, బొప్పాయి జ్యూస్ తాగినా పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.