Site icon HashtagU Telugu

Biryani : అబ్బ.. అని లొట్టలేసుకుని తిన్నారో అంతే సంగతి !!

Biryani

Biryani

ఒకప్పుడు నగరాలు, పెద్ద పట్టణాలకే పరిమితమైన బిర్యానీ (Biryani) సంస్కృతి ప్రస్తుతం మండల కేంద్రాల నుంచి ఓ మోస్తరు పెద్ద గ్రామాలకూ విస్తరించింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే ఆహారంగా మారిన బిర్యానీ, తక్కువ ధరలు, ఉచిత కూల్‌డ్రింక్స్ వంటి ఆఫర్లతో ఆహార ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. పలు జిల్లా కేంద్రాలతో పాటు మున్సిపల్ పట్టణాల్లో కరోనా అనంతరం వందల సంఖ్యలో బిర్యానీ సెంటర్లు పుట్టుకొచ్చాయంటే దానికున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. అయితే అందరికీ అందుబాటు ధరలో లభిస్తున్న ఈ బిర్యానీలో నాణ్యత ఎంత అనేది ఎవరూ చెప్పలేని ప్రశ్న. లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాలను పణంగా పెడుతూ కంటికి ఇంపుగా కనిపించడం కోసమో, కృత్రిమ రుచుల కోసమో బిర్యానీతో పాటు ఇతర మాంసాహార వంటకాల్లో ప్రమాదకరమైన రంగులను విపరీతంగా కలుపుతున్నారు.

PM Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై మోడీ స్పందన..భారత్‌ ‘డెడ్‌ ఎకానమీ’ కాదు..మూడో అతిపెద్ద ఆర్థిక శక్తి

ఈ రంగులను కలపడం వల్ల ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలను వినియోగదారులు డబ్బులు పెట్టి మరీ తింటున్నారు. వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడటం, అపరిమితంగా ఫుడ్ కలర్ వాడటం వల్ల ప్రజల ఆరోగ్యాలకు ఎన్నో అనర్థాలు వాటిల్లుతున్నాయి. నాణ్యత విషయంలో తోపుడుబండ్ల దగ్గర నుంచి ఖరీదైన రెస్టారెంట్ల వరకు ఇదే పరిస్థితి. అన్ని జిల్లాల వ్యాప్తంగా వేలల్లో ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లలో అధికారికంగా రిజిస్టర్ అయినవి కేవలం 20% లోపే. వీటిలో పెద్ద, చిన్న తేడా లేకుండా చాలావరకు హోటళ్లు, ఫుడ్, బిర్యానీ సెంటర్లలో ఆహార భద్రత నిబంధనలను అస్సలు పాటించడం లేదు.

దీంతో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో రోజువారీ ఓపీల్లో దాదాపు 14% కేసులు ఫుడ్ పాయిజనింగ్ సమస్యలవే నమోదవడం ఈ కల్తీ తీవ్రతకు అద్దం పడుతోంది. గ్యాస్ట్రో ఎంటరాలజీ కేసులు కూడా పెద్దఎత్తున వస్తున్నాయి. నాణ్యత లేని ఆహార పదార్థాలతో గుండె, నరాలు, ఎముకల సమస్యలు తలెత్తడంతో పాటు చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా, కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాలతో క్యాన్సర్ పొంచి ఉందని, పదార్థాల్లో కలిపే కెమికల్స్ వల్ల మహిళల్లో రుతుసంబంధమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, వేడివేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లు, బకెట్లు, డబ్బాల్లో ప్యాక్ చేస్తుండటం వల్ల కూడా క్యాన్సర్ కారక పదార్థాలను ప్రజలు కొని మరీ తింటున్నారు.

Chandrababu : రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

ఆహార పదార్థాల్లో కల్తీని నివారించడానికి ఏర్పాటు చేసిన ఆహార భద్రత, ప్రమాణాల చట్టం అమలు గురించి పట్టించుకునే వారే లేరు. నిత్యం తనిఖీలు చేపట్టి నిబంధనలు అమలవుతున్నాయో లేదో పరిశీలించి, కల్తీలను అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ బాధ్యతను విస్మరిస్తున్నారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం 19 నిబంధనలు పాటించాలి, కానీ ఏ హోటల్, ఫుడ్ సెంటర్‌లోనూ వీటి జాడే కనిపించడం లేదు. కల్తీ, కలుషిత, విషతుల్య ఆహార పదార్థాలను అడ్డుకోవాలన్న ఆలోచన ఆయా శాఖాధికారుల్లో లోపించింది. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హోటళ్లలో వినియోగించే రంగుల డబ్బాలు, టేస్టింగ్ సాల్ట్ ప్యాకెట్లు బహిరంగంగానే దర్శనమిస్తున్నా అధికారులకు అవి కనిపించకపోవడం, పెద్దఎత్తున బిర్యానీ హోటళ్లు వెలసి, రకరకాల ఆఫర్లు, కల్తీ రంగులతో వినియోగదారులను ఆకర్షిస్తుంటే ఈ కల్తీ దందా ఏదీ సదరు విభాగానికి కనబడకపోవడం మరింత విస్మయపరిచేదిగా ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజారోగ్యం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.