Site icon HashtagU Telugu

Diabetes: మీరు షుగర్ పేషంట్లైతే ఈ ఐదు జాగ్రత్తలు పాటించండి

Milk For Diabetes

Milk For Diabetes

మీ వయస్సు, మీ కుటుంబ చరిత్ర మాత్రమే మీ మధుమేహంకు కారణమవుతాయి అనుకుంటే పొరబడినట్లే. మీ జీవనశైలి, మీరోజు వారి అలవాట్లు కూడ మీకు మధుమేహం పెరగడానికి కారణమవుతాయి. మధుమేహం విషయంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను విడుదల చేసి మీరు తినే ఆహారం నుంచి మీ శరీరానికి కావలసిన చక్కెరను అందిస్తుంది. మిగిలిన క్యాలరీలను శరీరంలో నిల్వ చేస్తుంది. మీ ప్యాంక్రియాస్ పనితీరులో ఏమాత్రం తేడా వచ్చినా మీకు మధుమేహం వచ్చినట్లే. ఒక్కసారి మధుమేహం వస్తే మందులతో పాటు సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో చాలా సహాయపడతాయి. మీరు ఆల్ రెడీ షుగర్ పేషెంట్ అయితే, మీ జీవనశైలిలో మార్పులు చేయాలనుకుంటే ముందుగా మీ వైద్య నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. డయాబెటిస్‌కు కారణమయ్యే కొన్ని ప్రమాదకరమైన జీవన అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

1. అధిక కేలరీల ఆహారం: షుగర్ పేషంట్లు అధిక కేలరీల ఆహారం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరాదు. అధిక కేలరీల వినియోగం బరువు పెరగడానికి కారణమవుతుంది. బరువు పెరిగితే టైప్ 2 డయాబెటిస్‌ ను కంట్రోల్ లో ఉంచడం చాలా కష్టం. కాబట్టి మీ దినచర్యకు అనుగుణంగా కేలరీలు తీసుకోవాలి. కాబట్టి తక్కువ వ్యాయామం చేసేవారు తక్కువ కేలరీలు, ఎక్కువ వ్యాయామం చేసే వారు ఎక్కువ కేలరీలు తీసుకోవాలి.

2. మధుమేహంలో సూర్యరశ్మి పాత్ర: సూర్యరశ్మిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ప్రమాదకరమైన కిరణాల కారణంగా క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలా అని సూర్యరశ్మి మన శరీరానికి అసలు తగలకుండా ఎప్పుడు ఏసీ రూములలో ఉన్నా మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. సూర్యరశ్మి మన శరీరానికి తగలకపోతే విటమిన్ డి లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. విటమిన్ డి లోపం ఉన్నవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ప్యాంక్రియాస్ పనితీరులో విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి, రోజులో కొంత సమయంలో ఎండలో ఉండటం మంచిది.

3. ధూమపానం: ధూమపానం చేయడం నేడు ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. కాలేజీకి వెళ్లే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ధూమపానం చేస్తున్నారు. ధూమపానం చేయని వారి కంటే ధూమపానం చేసేవారికి మధుమేహం వచ్చే అవకాశం 30 నుండి 40 శాతం ఎక్కువ ఉంటుందని పరిశోధనల్లో తేలింది. విపరీతంగా ధూమపానం చేసేవారికి మరింత ఎక్కువ ప్రమాదం ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు.

4. వ్యాయామం: షుగర్ పేషెంట్లకు రోజుకు కనీసం 30 నుంచి 45 నిముషాలు శారీరక వ్యాయామం తప్పనిసరి. మధుమేహ కుటుంబ చరిత్ర ఉన్న వారు వ్యాయామం చేయడం ద్వారా షుగర్ వ్యాధి తొందరగా రాకుండా జాగ్రత్తపడొచ్చు. సరైన వ్యాయామంతో కార్డియో-రెస్పిరేటరీ సమస్యలతో బాధపడేవారు అనేక ప్రయోజనాలు పొందవచ్చని కూడా అధ్యయనాలు నిరూపించాయి.

5. భారీ విందులు: చాలా రోజుల తర్వాత పెళ్లికో, పబ్బానికో వెళ్లామని భారీస్థాయిలో విందు ఆరగించడం చాలా సాధారణం అయిపోయింది. భారీ విందులతో ఎక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల అది మన శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భారీ విందులు అధిక బరువుకు కారణమవుతాయి. కాబట్టి, మీ భోజనాన్ని తేలికగా, ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి.

ఈ నియమాలను పాటిస్తే షుగర్ లేనివారికి ఆ వ్యాధి త్వరగా వచ్చే అవకాశం ఉండదు. ఉన్నవారికి దానిని నియంత్రణలో ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి.

Exit mobile version