అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని అనేక రూపాల్లో తీసుకుంటూ ఉంటారు. ఈ అవిసె గింజలు మధుమేహం ఉన్నవారికి గొప్ప ఔషధం అని చెప్పాలి. ఈ గింజల్లోనే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందట. ఫైబర్ ఆహారంలోని చక్కర స్థాయిలను నెమ్మదిస్తుందని దీని కారణంగా రక్తం గ్లూకోస్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు అని చెబుతున్నారు.అయితే ప్రతీ రోజూ 10 గ్రాముల అవిసె గింజల పొడిని తీసుకోవడం వల్ల టైప్ 2 మధుమేహం ఉన్నవారిలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయట. ఈ గింజలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని చెబుతున్నారు.
అలాగే అవిసె గింజల్లో ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లం రూపంలో పుష్కలంగా ఉంటుందట. ఇది గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందట. ఈ గింజలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయని,రోజూ అవిసె గింజలను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల్లో ద్రావణీయం కాని ఫైబర్ అధికంగా ఉంటుందట. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గిస్తుందట. ఈ ఫైబర్ ఆకలిని నియంత్రిస్తూ ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుందట. ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుందట.
అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి అవిసె గింజలు ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్ తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే అవిసె గింజల్లో లిగ్నాన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయట. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయని, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ గింజలు ఎంతో బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదేవిధంగా అవిసె గింజల్లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. అవిసె గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గాయాలు త్వరగా నయం అవుతాయట. అలాగే చర్మం కూడా సహజమైన గ్లోను పొందుతుందట. అయితే ఇంతకీ ఈ అవిసె గింజలు ఎలా తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. రోజుకు 1 లేదా 2 టీ స్పూన్ల అవిసె గింజల పొడి తీసుకోవడం సురక్షితం ప్రయోజనకరం. మధుమేహ మందులు తీసుకునే వారు లేదా రక్తపోటు సమస్యలు ఉన్నవారు ఈ గింజలను ఆహారంలో చేర్చే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.