మీకు ఫాస్ట్ ఫుడ్ ఇష్టమా? ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటారా? అయితే అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ మాటలు వినండి. ఫాస్ట్ ఫుడ్(Fast Food) తినడం వల్ల కాలేయానికి హాని కలుగుతుందని వారు వార్నింగ్ ఇస్తున్నారు. శరీరానికి అందే మొత్తం రోజువారీ కేలరీలలో కనీసం 20 శాతం కనుక ఫాస్ట్ ఫుడ్ ఉంటే నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి(Non Alcoholic Fatty Liver) ప్రమాదం ఉంటుందని చెప్పారు. కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. ఫలితంగా కాలేయ వైఫల్యం , కాలేయ క్యాన్సర్‌తో సహా సిర్రోసిస్ వంటి సమస్యలు కూడా వస్తాయని హెచ్చరించారు. ప్రత్యేకించి ఊబకాయం లేదా మధుమేహం ఉన్న వ్యక్తుల కాలేయంపై ఫాస్ట్ ఫుడ్ ప్రభావం చాలా నెగెటివ్ గా ఉంటుందన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు దాదాపు 4,000 మంది పెద్దలు తినే ఆహారం మోతాదు.. వారి కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వు మోతాదు గణాంకాలను సేకరించి విశ్లేషించారు. 30 శాతం మందిలో బాడీకి రోజూ అందే కేలరీలలో దాదాపు 20% బర్గర్‌లు, ఫ్రైస్, పిజ్జా (Burgers Fries and Pizza) వంటి ఫాస్ట్ ఫుడ్‌ల నుంచి అందుతోందని తేలింది.రోగులు కొవ్వు ఉండే ఫుడ్స్ ను, కార్బోహైడ్రేట్ల ఫుడ్స్ ను తగ్గించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.
* గుండె పనితీరుపై దుష్ప్రభావం
చాలా మటుకు ఫాస్ట్ ఫుడ్స్ లో కొవ్వు పదార్థాలు అధికం. ఇవి గుండె పనితీరుపై దుష్ప్రభావం చూపిస్తాయి. తద్వారా హృదయ కండరాల వాపు, ఎథెరోస్క్లెరోసిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు కలవు. ఫాస్ట్ ఫుడ్ ని తీసుకోవడం వల్ల కలిగే నెగటివ్ ఎఫెక్ట్స్ లో ఇవి ముఖ్యమైనది.
* క్యాన్సర్
ఫాస్ట్ ఫుడ్ ని తరచూ తీసుకోవడం వల్ల కోలోరెక్టాల్ క్యాన్సర్ తో పాటు ప్రేగు క్యాన్సర్ కి గురయ్యే అవకాశం ఉంది. ఫాస్ట్ ఫుడ్స్ ని తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలలో ఇది కూడా ఒకటి.