Health Survey: మహిళల్లో అధిక కొవ్వు.. ఆరోగ్యానికి తీవ్ర ముప్పు!

మహిళల్లో పొట్ట వద్ద అధిక కొవ్వు సమస్య ఉంటున్నదని ఓ అధ్యయనంలో తేలింది.

Published By: HashtagU Telugu Desk
Belly Fat

Belly Fat

మనదేశంలో నలభైశాతం పైగా మహిళల్లో పొట్ట వద్ద అధిక కొవ్వు సమస్య ఉంటున్నదని ఓ అధ్యయనంలో తేలింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే – 5 గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. నడుము చుట్టు కొలతని పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. 39-40 సంవత్సరాల మధ్య వయసున్న మహిళల్లో ప్రతి పదిమందిలో ఐదుగురు లేదా ఆరుగురు అబ్డామినల్ ఒబేసిటీకి గురవుతున్నారని అధ్యయనంలో కనుగొన్నారు. పెద్దవయసు, నగరాల్లో నివాసం, మాంసాహారం తినటం, ఈ అంశాలన్నీ మహిళల నడుము చుట్టుకొలతని పెంచేస్తున్నాయని అధ్యయన నిర్వాహకులు వెల్లడించారు.

పొట్ట వద్ద కొవ్వు ఎక్కువగా ఉంటే దానిని అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒటేసిటీగా పిలుస్తారు. కొవ్వు శరీరంలో ఎక్కడ పేరుకుని ఉంది…. అనేదాన్ని బట్టి అది చేసే హాని ఆధారపడి ఉంటుంది. కొవ్వు పొట్టవద్ద అధికంగా పేరుకుని ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ తరహా ఫ్యాట్ వలన అధిక రక్తపోటు, మధుమేహం, గుండెవ్యాధులు, స్ట్రోక్, గాల్ బ్లాడర్ వ్యాధులు, కీళ్లనొప్పులు, నిద్రలేమి, శ్వాస సమస్యలు, డిప్రెషన్ వంటి అనారోగ్యాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

మన దేశీయుల్లో పొట్ట వద్ద కొవ్వు ఎక్కువగా ఉండటం వల్లనే ఈ తరహా అనారోగ్యాలు పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఆడవారిలో 80 సెంటీమీటర్లు, మగవారిలో 94 సెంటీమీటర్లకు మించి నడుము చుట్టుకొలత ఉంటే అబ్డామినల్ ఒబేసిటీగా పరిగణిస్తారు.

  Last Updated: 18 May 2023, 11:23 AM IST