Site icon HashtagU Telugu

Oil rates: వారంలో తగ్గనున్న వంటనూనె ధర…!!

Palm Oil

Palm Oil

భారీగాపెరిగిన వంటనూనెల ధరలు…ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వంటనూనె రేట్లు తగ్గుతుండటంతో దేశంలో కూడా ఆయిల్ కంపెనీలు తమ వంటనూనె బ్రాండ్ల రేట్లను తగ్గించాలని కేంద్రం ఆదేశించింది. దిగుమతి చేసుకుంటున్న వంటనూనెల MRP లీటర్ పై రూ. 10 చొప్పున తగ్గించాలని… ఈ తగ్గింపు కూడా వచ్చే వారంలోపే జరగాలని పేర్కొంది. దీంతోపాటు ఒక బ్రాండ్ వంటనూనె రేటు దేశమంతటా ఒకేలా ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం పలు నగరాల్లో ఒకే బ్రాండ్ వంటనూనె లీటర్ ధరలో మూడు నుంచి ఐదు రూపాయల తేడా ఉంది. ఇక నుంచి ఒకే ధర ఉండేలా చూడాలని కంపెనీలకు కేంద్రం సూచించింది.

దేశంలో వంటనూనె అవసరాల్లో 60శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా వంటనూనె రేట్లు పెరిగాయి. దీంతో మన దేశంలో కూడా కంపెనీలు ధరలు భారీగా పెంచాయి. కానీ గత కొన్ని నెలల నుంచి వంటనూనెల ధరలు దిగివస్తున్నాయి. దీంతో గత నెలలో వంటనూనె ధరను ఆయా కంపెనీలు లీటర్ పై 10 నుంచి 15 రూపాయలు తగ్గించాయి. అంతకుముందు కూడా ఒకసారి రేట్లను సవరించాయి కంపెనీలు.

వంటనూనె రేట్లు తగ్గడంపై చర్చించేందుకు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే వంటనూనె తయారీదారుల అసోసియేషన్లతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులు, ఎంఆర్ పీ తగ్గింపుపై చర్చలు జరిపారు. అంతర్జాతీయంగా తగ్గిన ధరలను వినియోగదారులకూ బదలాయించాలని సూచించారు.

Exit mobile version