ఇటీవల కాలంలో గుండెపోటు (Heart Attack) మరణాలు ఎక్కువైపోతున్నాయి. చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ క్రమంలో సాధారణ ఉప్పుకు బదులు సోడియం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ ఉప్పును (LSSS) వినియోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసింది. దీని ద్వారా గుండెపోటు ముప్పు తగ్గుతుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. LSSS అనేది సోడియం క్లోరైడ్ స్థానంలో పొటాషియం క్లోరైడ్‌ను కలిపి తయారుచేసే ఉప్పు. ఈ ఉప్పు వినియోగంపై 2012లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాలను భారత్ సహా సభ్యదేశాలు ఆమోదించాయి.
Harish Rao : పరవళ్లు తొకుతున్న కాళేశ్వర జలాలు…పరవశించిన హరీష్ రావు
సోడియం క్లోరైడ్ అదికంగా ఉండే ఉప్పు వాడకాన్ని 2030 నాటికి 30 శాతం మేర తగ్గించాలని ప్రపంచ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ప్రస్తుతం ఆశించిన మేర పురోగతి లేకపోవడంతో ఆ లక్ష్యం చేరుకోవడం అసాధ్యం. ఈ నేపథ్యంలో సోడియం తక్కువ వినియోగింతో పాటు పాటు ప్రత్యామ్నాయ ఉప్పును ప్రోత్సహించాలని డబ్ల్యూహెచ్ఓ నిర్ణయించింది. వాస్తవానికి 15 నుంచి 30 శాతం తక్కువ సోడియం ఉండే ప్రత్యామ్నాయ ఉప్పును వివిధ బ్రాండ్లు భారత్‌లో అమ్ముతున్నాయి. కానీ, వీటి ధర అధికం కావడం, జనాభాలో అంతగా అవగాహన లేకపోవడంతో అతికొద్ది మంది మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం ఎక్కువగా పేర్లు వినిపిస్తోన్న పింక్ హిమాలయన్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, సీ సాల్ట్ వంటివి ఈ కేటగిరీలోకి రావు.
మొత్తం 26 ర్యాండమ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి.. వాటి ఫలితాల ఆధారంగా ఎల్ఎస్ఎస్ఎస్ వినియోగంపై డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసింది. సాధారణ ఉప్పుతో పోలిస్తే 56 రోజుల నుంచి ఐదేళ్ల మధ్య ప్రత్యామ్నాయ ఉప్పును తీసుకున్నవారిలో రక్తపోటు గణనీయంగా తగ్గుదల కనిపించింది. LSSSలో సోడియం శాతం తక్కువగా ఉండటమే కాదు, రక్తపోటును తగ్గించే పొటాషియం కూడా ఉంటుంది. కానీ, కిడ్నీల పనితీరు బలహీనంగా ఉన్నవారు మాత్రం పొటాషియం అధిక మొత్తంలో తీసుకుంటే ప్రమాదమని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఎందుకంటే ఈ ఖనిజాలను మూత్రపిండాలు బయటకు పంపలేవని, ఇది హైపర్‌కలేమియాకు దారితీసి తద్వారా గుండె పనితీరును ప్రభావితం చేసి, ప్రాణాంతకంగా మారుతుందని పేర్కొంది. కాబట్టి కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు పొటాషియం ఉండే ఈ ప్రత్యామ్నాయ ఉప్పు వినియోగానికి దూరంగా ఉండాలి. అలాగే, పిల్లలు, గర్భిణీలకు కలిగే ప్రయోజనాలకు తగినంత ఆధారాలు లేనందున ఈ వర్గాలను కూడా సిఫార్సు నుంచి తొలగించింది.