Site icon HashtagU Telugu

Detox Drink :ఈ డ్రింక్ తాగితే అధిక బరువుతోపాటు..శరీరం శుభ్రపడుతుంది..!!

Jeera Water

Jeera Water

ఈ రోజుల్లో దాదాపు సగం మంది అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు అధికంగా పెరిగితే ఎన్నో జబ్బులు చుట్టుముడతాయి. తినే ఆహారం, నిద్ర సమయాల్లో మార్పులు, అధిక ఒత్తిళ్లు ఇవన్నీ కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాగా అధికబరువు నుంచి విముక్తి కలిగిస్తామంటూ ఎన్నో తరుణోపాయాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని అధిక ఖర్చుతో కూడుకున్నవి. మరికొన్ని నిపుణుల పర్యవేక్షణలోనే చేయదగినవి. ఈ నేపథ్యంలో చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో తయారు చేసుకోగలిగే ఓ డ్రింక్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఈ పానీయం బరువును తగ్గించడమే కాదు…శరీరంలోని మలినాలను బయటకు పారదోలుతుంది. వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతుందట. ఈ డ్రింక్ తయారుచేయడానికి మన ఇంట్లోనే ఉండే దినుసులు సరిపోతాయి.

జీలకర్ర, వాము, సోంపు:

జీలకర్ర, వాము, సోంపు గింజలతో తయారుచేసే ఈ డ్రింక్ ఓ ఇమ్యూనిటీ డ్రింక్ గా కూడా భావించవచ్చు. జీలకర్రలో ఉండే యాంటీయాక్సిడెంట్లు శరీరంలోని విషపదార్థాలను నిర్మూలించడంలో సహాయపడతాయి. దీంతో జీలకర్ర శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుంది. అంతేకాదు జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఉదయం జీలకర్ర కలిపిన నీళ్లు ఒక గ్లాసు తాగితే బరువు తగ్గడమే కాదు…ఆరోగ్యం కూడా ఎంతో మెరుగవుతుందని బెంగుళూరుకు చెందిన పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

వాము
వాము అరుగుదలను వేగవంతం చేస్తుంది. అదనపు బరువు పెరగడాన్ని ఇది నిరోధిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు వామును తప్పకతీసుకోవాలని నిపుణులు అంటున్నారు.

సోంపు
మసాలా దినుసులుగా వంటకాల్లో సువాసనకోసం ఉపయోగించే సోంపు గింజల్లోనూ ఔషధ విలువలు పుష్కలంగా ఉన్నాయని మాక్రోబయోటిక్, పోషకాహార నిపుణులు తెలిపారు. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి జీవక్రియలు మరింత సజావుగా జరిగేలా సోంపు తోడ్పడుతుంది. ముఖ్యంగా మనం తినే ఆహారం నుంచి పోషకాలను శరీరం గ్రహించేందుకు ఈ సోంపు సహాయకారిగా ఉంటుంది. దాంతో శరీరం మరింత శక్తివంతమవుతుంది. దీంతో పదే పదే ఆకలి వేయడం….తినడం కూడా తగ్గుతుంది. ఆ విధంగా అధిక బరువు నియంత్రణలో సోంపు ఉపయోగపడుతుంది.

వీటితో డ్రింక్ ఎలా తయారు చేయాలంటే…
అరలీటరు నీటిలో ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను వాము, ఒక స్పూను సోంపు వేసి వాటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయానికల్లా పానీయం రెడీ అవుతుంది. దీన్ని పరగడుపునే తాగాలి.