Site icon HashtagU Telugu

Drinking Water : రాత్రి పడుకునే ముందు మంచినీరు తాగాలా వద్దా ? తాగితే ఏమవుతుంది ?

Water Health Benefits

drinking water in night time

Drinking Water : మనం బ్రతకడానికి గాలి పీల్చుకోవడం ఎంత అవసరమో.. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా.. శరీరంలో మలినాలు బయటకు పోవాలన్నా, చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా మంచినీరు తాగడం అంత అవసరం. ప్రతిరోజూ 3-4 లీటర్ల నీటిని ఖచ్చితంగా తాగాలన్న విషయం తెలిసిందే. అయితే.. రాత్రిపడుకునే ముందు నీరు తాగాలా వద్దా అన్నదానిపై చాలామందికి సందేహాలున్నాయి. దీనిగురించి నిపుణులు ఇలా చెప్పారు.

షుగర్, గుండె సంబంధిత సమస్యలున్నవారు రాత్రివేళలో నీటిని ఎక్కువగా తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. రోజంతా పనిచేస్తుండటంతో.. శరీరం నీటిని ఎక్కువగా కోల్పోతుంది. శరీరంలో నీటిశాతం తగ్గిపోతుంది. శరీరంలో తగినంత నీరు లేకపోతే నిద్రించేటపుడు ఇబ్బందులకు గురికావలసి ఉంటుంది. రాత్రిపడుకునే సమయంలో శరీరంలో నీటి శాతం తగ్గడంతో గొంతు ఆరిపోతుంది. అలాగే గురక ఎక్కువగా వస్తుంటుంది. అందుకే నిద్రించే ముందు శరీరంలో తగినంత నీటిశాతం ఉండేలా చూసుకోవాలి.

పడుకునేముందు శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. శరీరం అలసట తగ్గుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. మరుసటిరోజున ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతాం అని నిపుణులు సూచిస్తున్నారు. పడుకునేముందు నీరు ఎక్కువగా తాగితే శరీరంలో మలినాలు తొలగిపోతాయి. చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. వేడిచేయడం వంటి సమస్యలు తగ్గుతాయి.

అలాగని పొట్టనిండా నీరు తాగి పడుకుంటే.. శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గుండెల్లో మంట కూడా రావొచ్చు. మూత్రవిసర్జన కారణంగా నిద్రాభంగం కూడా జరగవచ్చు. కాబట్టి పడుకునేముందు తగిన మోతాదులోనే నీటిని తాగి పడుకోవాలని చెబుతున్నారు. రాత్రిపూట పడుకునే ముందు నీరు తాగడం మంచిదే కానీ.. అది మోతాదుకు మించి ఉండకూడదు.