Alcohol Effects : పీకల్లోతు మద్యం తాగాక… వాంతులు ఎందుకు చేసుకుంటారో తెలుసా..?

  • Written By:
  • Updated On - November 2, 2022 / 01:56 PM IST

కొంతమంది అతిగా మద్యం తాగి వాంతులు చేసుకున్నరన్న మాటలు వింటునే ఉంటాం. తక్షణమే ఉపశమనం పొందేందుకు కొందరు కావాలని బలవంతంగా వాంతులు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అలా చేస్తే మత్తుదిగిపోతుంది అనుకుంటారు. కొంతమంది మద్యం ఎక్కువగా తాగడంవల్ల నిద్రపోతుంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం మాత్రమే కాదు…ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎక్కువ తాగితే వాంతులు ఎందుకు అవుతాయి.
అతిగా తాగడం, తరచుగా వాంతులు కావడం ప్రమాదకరం. ఖాళీ కడుపుతో మద్యం తాగితే…ఇలా జరుగుతుంది. వాస్తవానికి మన శరీరం ఆల్కహాల్ ను విషంగా భావించి శరీరం నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుంది. శరీరంలోకి ఆల్కాహాల్ వెళ్లిన తర్వాత…కాలేయం దానిని విషరసాయనమైన ఎసిటాల్డిహైడ్ గా మారుస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. కాలేయం అసిటాల్డిహైడ్ ను అసిటేట్ గా మారుస్తుంది. తర్వాత కార్బన్ డయాక్సైడ్ రూపంలో శరీరం నుంచి బయటకు వస్తుంది. ఎసిటాల్డిహైడ్ స్థాయిని మించి ఉంటే శరీరం వాంతుల రూపంలో బయటకు పంపించేందుకు యత్నిస్తుంది. అదే సమయంలో ఆల్కహాల్ మన కడుపులోని ఎంజైమ్ వ్యవస్థను చేరుకున్నప్పుడు పెద్దమొత్తంలో విషరసాయనాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ఇలా జరగడంతో సహజంగా వాంతులు అవుతుంటాయి.

అయితే వాంతులు చేసుకుంటే మత్తు తగ్గుతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. వాంతులు చేసుకుంటే మత్తు తగ్గదు. వాంతులు చేసుకుంటే కొంత ఆల్కాహాల్ బయటకు వస్తుంది. కానీ రక్తంలో కరిగిన ఆల్కాహాల్ పరిమాణం ఎప్పటికీ తగ్గదు. ఆల్కాహాల్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రక్తంలో కలిసిపోతుంది. ఈ కారణంతో ఆల్కాహాల్ సేవించిన వ్యక్తి మత్తుగా ఉంటాడు. ఈ ప్రక్రియ అనేది చాలా వేగంగా జరుగుతుంది. కాబట్టి వాంతుల నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుంది. కానీ మత్తు తగ్గదు.

అలాగే అతిగా తాగిన వ్యక్తులు మత్తు కారణంగా నిద్రించేందుకు ప్రయత్నిస్తారు. ఆల్కాహాల్ తాగితే త్వరగా నిద్రవస్తుంది. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. నిద్రలో కూడా రక్తంలో ఆల్కాహాల్ స్థాయి పెరుగుతుంది. ఎక్కువగా మత్తులో ఉన్నవారు నిద్రించడానికి ప్రయత్నిస్తే ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆల్కాహాల్ ప్రభావం.. శ్వాసలోపానికి కారణంగా అవుతుంది. దీని వల్ల నిద్రలో కూడా వాంతులు అయ్యే ప్రమాదం ఉంటుంది. అలా గొంతు ఉక్కిరిబిక్కిరిగా మారి వ్యక్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.