బీర్ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అన్ని రకాల సమస్యలు కూడా వస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొంతమంది ప్రతి రోజు బీరు తాగితే మరికొందరు ఎప్పుడో ఒకసారి బీరు తాగుతూ ఉంటారు. ఇంకొందరు బీరు తాగడం మంచిదే కదా అని వారంలో రెండు మూడు సార్లు తాగుతూ ఉంటారు. అయితే ఏదైనా కానీ మంచిదే కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవని చెబుతున్నారు. చాలామంది బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి అని అంటూ ఉంటారు. మరి నిజంగానే బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయ ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కిడ్నీలలో అనేక రకాల కారణాల వల్ల చిన్నచిన్న రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. మూత్రపిండాల లోపల ఉన్న ద్రవ పదార్ధం స్ఫటికీకరణ ఫలితంగా ఈ రాళ్లు ఏర్పడతాయి. అయితే కాల్షియం, యూరిక్ ఆమ్లం లేదా ఇతర లోహాలు మూత్రపిండాల్లో కలిసిపోతాయి. ఈ కారణంగా అవి రాయి లాంటి ఆకారాన్ని ఏర్పరుస్తాయి. వీటినే కిడ్నీ స్టోన్స్ అంటాం. దీనితో పాటుగా అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి మూత్రపిండాల వ్యాధులు వంటి ఇతర సమస్యలు కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. కొంతమందికి నీళ్లను తక్కువగా తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల మూత్రం సరిగా తయారు కాదు. దీనివల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే కిడ్నీలో రాళ్లు జెనెటిక్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. అంటే మీ కుటుంబంలో ఎవరికైనా ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇక బీర్ తాగడం వల్ల రాళ్ల ప్రమాదం తగ్గుతుందా? అన్న విషయానికి వస్తే.. ఒక అధ్యయనం ప్రకారం బీర్ తాగడం వల్ల రాళ్లు కరుగుతాయని, లేదా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది అనడానికి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు ఆల్కహాల్ ను తాగడం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఆల్కహాల్ లేదా బీర్ ఎక్కువగా తాగడం వల్ల మూత్రపిండాల వైఫల్యం, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయట. బీర్ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ రావు అనేది కేవలం ఒక అపోహ మాత్రం. బీర్ తో పాటుగా అన్ని రకాల ఆల్కహాల్ మూత్రవిసర్జనగా పనిచేస్తాయి. అంటే ఇవి మూత్రం ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే మూత్రపిండాల నుంచి రాళ్లు ఏర్పడే పదార్థాలను బయటకు తీయడానికి సహాయపడుతుంది. అయితే మితిమీరిన ఆల్కహాల్ సేవించడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ కు దారితీస్తుందని, ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.