Green Tea: అధికంగా గ్రీన్ టీ తాగితే ముప్పు తెలుసా..!

గ్రీన్ టీతో ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు కానీ, అదే గ్రీన్ టీ కొందరిలో కాలేయ (Liver) సమస్యలకు

గ్రీన్ టీ (Green Tea)తో ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు కానీ, అదే గ్రీన్ టీ కొందరిలో కాలేయ (Liver) సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్ టీ (Green Tea)ని దీర్ఘకాలంగా తీసుకునే వారిలో కేన్సర్, గుండె జబ్బులు, స్థూలకాయం, టైప్ 2 మధుమేహం రిస్క్ తగ్గుతుందని పలు అధ్యయనాలు తేల్చాయి. కానీ, తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం కొందరిలో కాలేయం దెబ్బతినడానికి కూడా గ్రీన్ టీ కారణం కావచ్చని పరిశోధకులు గుర్తించారు.

కాటెకాల్ ఓ మెథిల్ ట్రాన్సఫరేస్ జీనోటైప్ వారిలో గ్రీన్ టీతో కాలేయం దెబ్బతింటుందని చెబుతున్నారు. యూజీటీ1ఏ4 జీనోటైప్ వారిలో ఎనిమిది నెలల పాటు గ్రీన్ టీ (Green Tea) తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటున్నట్టు తెలుసుకున్నారు. గ్రీన్ టీ తీసుకోవడం ఎవరికి సురక్షితం అనే విషయాన్ని నిర్ధారించడానికి మరెన్నో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నది ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తల అభిప్రాయం.

గ్రీన్ టీని అధిక మోతాదులో దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల ప్రయోజనాలున్నాయనే దానికి ఆధారాలు పెరుగుతున్నందున గ్రీన్ టీతో కాలేయం దెబ్బతినే ప్రమాదం ఎవరికి ఉంటుందో అంచనా వేయడం ముఖ్యమని ఈ పరిశోధనలో పాల్గొన్న హమీద్ సమవత్ పేర్కొన్నారు. రట్గర్స్ స్కూల్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషన్స్, న్యూట్రిషన్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఆయన పనిచేస్తున్నారు. జన్యుపరమైన వైవిధ్యాలున్నవారికి గ్రీన్ టీతో కాలేయం దెబ్బతినే రిస్క్ ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.

Also Read:  Taj Mahal: తాజ్ మహల్ లో పరిశోధనకు ఆదేశాలివ్వలేం: సుప్రీంకోర్టు