Site icon HashtagU Telugu

Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

Work From Home

Work From Home

కరోనా మహమ్మారి తరువాత ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం స్కీమ్ ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఆఫీసుల్లో ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలు పని చేసినప్పుడు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం అయితే ఎంత బాగుంటుంది అని అనుకునేవారు. కానీ కరోనా తర్వాత కొద్దిరోజులు గడిచాక వర్క్ ఫ్రం హోం వద్దు బాబోయ్ అని అంటున్నారు. డ్యూటీ అవర్స్ కంటే ఎక్కువగా పని చేయాల్సి వస్తుందని తలలు పట్టుకుంటున్నారు ఉద్యోగులు. అవన్నీ పక్కన పెడితే ఇంట్లో వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. మరి వర్క్ ఫ్రం హోమ్ వల్ల కలిగే సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ వర్క్ ఫ్రం హోం పుణ్యమా అని ఇంట్లో కూర్చుని గంటల తరబడి ఒకే భంగిమలో ఉంటారు. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉంటారు. అదే ఆఫీసులో అయితే మధ్య మధ్యలో స్నేహితులతో మాట్లాడడం, వారితో బయటికి టీ తాగడానికి వెళ్లడం, ఇటూ అటూ నడవడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో మాత్రం కదలకుండా ఎక్కువ గంటలసేపు కూర్చుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఎముకలు, కండరాలు, కీళ్ల సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఇలాగే కొన్నేళ్లపాటు కొనసాగితే కండరాలు, ఎముకలు, కీళ్లు క్షీణిస్తాయి. ఇంటి నుండి బయటకు రాకుండా ఉండడం వల్ల విటమిన్ డి కూడా శరీరానికి అందడం లేదు. శరీరంలో విటమిన్ డి ఎప్పుడైతే తగ్గిందో క్యాల్షియం కూడా తగ్గిపోతుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎముకలు త్వరగా విరిగిపోయే అవకాశం ఉంది.

ధూమపానం ఎంత హానికరమో, గంటల తరబడి ఒకే దగ్గర కూర్చొని పనిచేసే వర్క్ ఫ్రం హోం పద్ధతి కూడా అంతే హానికరం. ఇలా చేయడం వల్ల వెన్ను కండరాలు, ఎముకలు దెబ్బతింటాయి. ఇలా కొన్ని గంటల పాటు కదలకుండా ఉండడం వల్ల డీప్ వీనస్ థ్రాంబోసిస్ అనే తీవ్రమైన ఆరోగ్య సమస్య రావచ్చు. దీనివల్ల కాళ్లల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువ. అలాగే ప్రాణాంతకమైన పల్మనరీ ఎంబోలిజం సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఎక్కువ గంటల పాటు కదలకుండా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనివల్ల నడుము వంకరగా మారే అవకాశం ఉంది. కాలక్రమేనా నడుము దిగువ భాగంలో, మధ్య భాగంలో ఉన్న కండరాలు బలహీన పడవచ్చు. దీనివల్ల నడుము నొప్పులు, మెడ నొప్పులు వస్తాయి. కాబట్టి నిశ్చల జీవనశైలిని అలవాటు చేసే వర్క్ ఫ్రం హోం వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు ఏమీ లేదు.

వర్క్ ఫ్రం హోమ్ చేసేవారిలో ఒత్తిడి కూడా అధికంగా ఉంటున్నట్టు చెబుతున్నారు పరిశోధనకర్తలు. ఇలా దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళనకు గురువుతున్న వారిలో మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది ఎముక ఆరోగ్యాన్ని కూడా పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్తనాళాలు పరిమితంగానే రక్తాన్ని అవయవాలకు సరఫరా చేస్తాయి. దీనివల్ల కండరాలు, కీళ్లు దెబ్బతింటాయి. కొన్ని అవయవాలకు రక్త ప్రవాహం తగ్గిపోతుంది. ఒకవేళ వర్క్ ఫ్రం హోం జాబ్ చేయక తప్పదు అనుకునే వారు ప్రతి గంటకు ఒకసారి 10 నిమిషాల పాటు అలా తిరిగి మళ్లీ కూర్చోవడం మంచిది.

Exit mobile version