BP Medicines : హై బీపీ (అంటే రక్తపోటు) మందులు వాడుతున్నారా? ఆరోగ్యం బాగుందనిపించి అర్ధాంతరంగా మందులు మానేయాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆలోచించండి! ఎందుకంటే, బీపీ మందులను అనుకున్నట్టే మానేయడం… మీ గుండెకు ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణంగా బీపీ మందులు రక్తపోటును నియంత్రించి గుండెపై భారం తగ్గించడంలో సహాయపడతాయి. అయితే చాలామంది ‘ఇప్పుడు బీపీ లేదు కదా’ అనే అనుమానంతో మందులు మానేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బీపీ అనేది బయటకు కనిపించే లక్షణాలు లేకుండానే ఉండే సమస్య. ఒకసారి మళ్లీ బీపీ పెరిగితే… గుండెపోటుకు అవకాశం పెరుగుతుంది.
Read Also: Alimony : వరకట్నం నేరం అయితే, భరణం అడగడం చట్టబద్ధమైనదేనా?
అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ చేసిన తాజా అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు బయటపడ్డాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న 975 మందిలో, 886 మంది బీపీ మందులు మానేశారు. వీరిలో చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు—స్ట్రోక్, టెంపరరీ ఇస్కీమిక్ అటాక్, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (హార్ట్ ఎటాక్), హార్ట్ ఫెయిల్యూర్ వంటి ఆరోగ్య సమస్యలు కనిపించాయి. ఒకవేళ బీపీ మందులు అర్ధాంతరంగా మానేస్తే, రక్తపోటు మళ్లీ పెరుగుతుంది. గుండె బాగా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వలన హార్ట్ బీట్ రేట్ మారిపోవడం, వణుకు రావడం, మానసిక ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి.
జాయింట్ నేషనల్ కమిటీ నివేదిక ప్రకారం, మందులు మానేయడం వలన కార్డియోవాస్కులర్ (హృదయ సంబంధ) సమస్యలు వేగంగా పెరుగుతాయని హెచ్చరించింది. అయితే, కొంతమంది రోగులు బీపీ నియంత్రణ కోసం మందులకే ఆధారపడకుండా జీవనశైలిలో మార్పులతో రక్తపోటును తగ్గించుకోవచ్చు. ప్రత్యేకంగా <145/85 mmHg బీపీ ఉన్నవారు, వైద్యుల సలహాతోనే మందులు మానేయవచ్చు. కానీ అది ఒక్క వైద్యుని సమర్థనతోనే. అలాంటి సందర్భాల్లో బరువు తగ్గడం, ఉప్పును తగ్గించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, మద్యం, పొగత్రాగడం వంటి మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండటం వంటి మార్పులు బీపీని సహజంగా నియంత్రించడంలో ఉపయోగపడతాయి.
అయితే, ఇదంతా గుండెకు సంబంధించి ఎటువంటి వ్యాధులు లేని వారికే వర్తిస్తుంది. ఇప్పటికే హృదయ సంబంధిత సమస్యలున్నవారు బీపీ మందులు మానేస్తే… అది తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా బీపీ మందులు మానేయాలనుకుంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి. అలాగే వైద్యుడు సూచించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించండి. జీవనశైలిలో మార్పులు తీసుకురాకుండా మందులు మానేయడం… జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్య అవుతుంది. ఆరోగ్యంగా ఉండాలి అంటే… జాగ్రత్తలు తప్పవు.
Read Also: Alimony : వరకట్నం నేరం అయితే, భరణం అడగడం చట్టబద్ధమైనదేనా?