గర్భం అనేది మహిళలకు చాలా ముఖ్యమైన క్షణం. ఈ సమయంలో, మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనివల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే, గర్భధారణ సమయంలో మహిళలు ఎన్నోసమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వాటిలో మలబద్ధకం ఒకటి. గర్భధారణ సమయంలో మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్య. మీ ఆహారం, జీవనశైలిలో మార్పులు తీసుకురండి. అలాగే ప్రతి రోజూ వ్యాయామం చేయండి. గర్భధారణ సమయంలో మలబద్ధకం సమస్యను అధిగమించడానికి ఈ సాధారణ చిట్కాలను అనుసరించండి. అవేంటో చూద్దాం.
నెయ్యి:
మీరు గర్భధారణ సమయంలో మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే, మీరు నెయ్యిని తీసుకోండి. నెయ్యి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేయడంతోపాటు జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. గోరువెచ్చని పాలలో నెయ్యి కలిపి తాగితే.. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
నీరు:
గర్భిణీలు మలబద్ధకం సమస్యను అధిగమించడానికి పుష్కలంగా నీరు త్రాగాలి. గర్భధారణ సమయంలో నీరు ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో ఉండే టాక్సిన్స్‌ని బయటకు పంపుతుంది. అదే సమయంలో, శరీరం కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది. ప్రతిరోజూ కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలి.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. అంతే కాకుండా జీర్ణక్రియ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చండి. బాదం, సోయాబీన్స్, బ్రకోలీ, క్వినోవా మొదలైన వాటిని చేర్చుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
వ్యాయామం:
ప్రెగ్నెన్సీలో వచ్చే మలబద్ధకం సమస్య నుంచి బయటపడేందుకు వ్యాయామం చేయడం మంచిది. దీని కోసం తేలికపాటి వ్యాయామం ఎంచుకోండి. యోగా కూడా చేయవచ్చు. యోగాలో చాలా ఆసనాలు ఉన్నాయి, వీటిని చేయడం ద్వారా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.