Site icon HashtagU Telugu

Don’t Drink Water : ఈ ఆహారాలు తిన్న వెంటనే మంచినీరు తాగకూడదట.. ఎందుకంటే ?

don't drink water while eating food

don't drink water while eating food

Don’t Drink Water : మనం ఆరోగ్యంగా ఉండటానికి పండ్లు, కూరగాయలు, గుడ్లు, ఇతర ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించేందుకు నీరు అంతే అవసరం. ఆహారాన్ని ఎలా అయితే తింటున్నామో.. నీరు కూడా శరీరానికి కావలసినంత తాగుతుండాలి. నిపుణులు సూచించిన దాని ప్రకారం.. రోజుల్లో 3-4 లీటర్ల నీటిని తాగాలి. అయితే.. కొన్ని ఆహారాలను తీసుకున్నపుడు మంచినీటిని తాగకూడదని కూడా సూచిస్తున్నారు. మనకు తెలిసీ తెలియక చేసే పొరపాటు ఏంటంటే.. భోజనం చేసేటపుడు మంచినీరు తాగడం. భోజనం తినేటపుడు చాలామంది గొంతు పట్టేసిందని, మంటగా ఉందని ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనట.

మరీ ముఖ్యంగా.. అన్నం తినే సమయంలో నీటిని అస్సలు తాగకూడదంట. అలాగే అన్నం తిన్న వెంటనే కూడా నీరు తాగకూడదు. అలా తాగితే పొత్తికడుపులో నొప్పి, తిమ్మిర్లు, అజీర్తి వంటి సమస్యలు తలెత్తవచ్చు. భోజనం చేసిన అరగంట తర్వాత మంచినీరు తాగాలి. అలాగే పెరుగు తినేటపుడు కూడా నీటిని తాగకూడదు. అందులో మంచి బ్యాక్టీరియాతో పాటు పోషకాలు కూడా ఉంటాయి. మంచినీరు వెంటనే తాగితే.. ఆ బ్యాక్టీరియా వల్ల కలిగే ప్రయోజనాలు తగ్గడంతో పాటు.. జీర్ణ‌ సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిమ్మజాతికి చెందిన పండ్లను అంటే.. నిమ్మ, బత్తాయి, కమల వంటివి తినేటపుడు కూడా నీరు తాగకూడదు. అలా తాగితే కడుపునొప్పి, ఉబ్బరం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అలాగే అరటిపండ్లు తినేటపుడు గానీ, తిన్న వెంటనే గానీ నీరు తాగితే.. గ్యాస్ట్రిక్ జ్యూస్ లు ఎక్కువగా ఉత్పత్తై.. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.

మసాలాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు, కారం ఎక్కువగా ఉండే ఆహారాలు తిన్నపుడు ఘాటు తట్టుకోలేక చాలామంది నీటిని ఎక్కువగా తాగేస్తుంటారు. ఇలా నీటిని తాగితే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమయంలో పెరుగును తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆహారాలను తినేటపుడు మంచినీటిని ఎక్కువగా తాగకూడదు. ఎమర్జెన్సీగా తాగాల్సి వస్తే.. చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.