Site icon HashtagU Telugu

Avoid Fish In Monsoon: వర్షాకాలంలో చేపలు తినకూడదా..తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Monsoon Season

Monsoon Season

మనం సాధారణంగా తినే మాంసాహార పదార్థాలలో చేపలు కూడా ఒకటి. చాలామంది చేపలను ఇష్టపడి తింటూ ఉంటారు. ఈ చేపల వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. చేపల్లో అన్ని రకాల పోషకాలు,ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్‌ లభిస్తాయి. అలాగే విటమిన్‌ ఏ,విటమిన్‌ డీ తోపాటుగా ఫాస్పరస్‌ వంటి పోషకాలు చేపలలో లభిస్తాయి. అమైనో యాసిడ్స్‌ ఉండే మాంసాహారం చేపలే మాత్రమే. ప్రతిరోజూ చేపలు తినేవారిలో గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు కూడా తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతుంటారు.

చిన్న చిన్న చేపల్ని ముల్లు సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్‌ మన శరీరానికి అందుతాయి. వీటిలో మాత్రమే దొరికే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి. ఇక ఇది ఇలా ఉంటే చేపలను వర్షాకాలంలో తినవచ్చా? తినకూడదా? ఒకవేళ తింటే ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చేపలను వర్షాకాలంలో తినకుండా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు. చేపలలో ఓమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో బలహీనంగా ఉండే మానవ జీర్ణవ్యవస్థ పై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఈ సీజన్‌లో ఎక్కువ మంది మాంసాహారం తినడానికి చాలా మంది ఇష్టపడతారు.

కానీ అది ఏమాత్రం మంచిది కాదు అని నిపుణులు సూచిస్తున్నారు. శీతలీకరణ చేప మాంసాన్ని వర్షాకాలంలో అసలు తినకూడదట. అందుకు గల కారణం చేపలు చెడిపోకుండా ఉండడం కోసం వాటి పై సల్ఫేట్స్, పాలి ఫాస్పేట్స్ వంటివి పూస్తారు. అవి 10 రోజుల తర్వాత తొలగిపోతాయి. దీంతో మాంసం పై బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాంటి మాంసం తీనడంతో రోగాలు వస్తాయి. కావున వర్షాకాలంలో మాంసాహారం ఎక్కువగా తింటే మంచిది కాదంటున్నారు వైద్యులు.