Site icon HashtagU Telugu

Antibiotic: యాంటీబయాటిక్ వినియోగం.. అతిపెద్ద ముప్పుగా మారే ప్రమాదం!

Antibiotic

Antibiotic

Antibiotic: యాంటీమైక్రోబియల్ అవేర్‌నెస్ వీక్ ప్రారంభం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్ (Antibiotic) ఔషధాల పెరుగుతున్న దుర్వినియోగం గురించి మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2015 నుండి ప్రతి సంవత్సరం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR) వల్ల కలిగే ప్రమాదం గురించి ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

ఈ సమస్య ఇప్పుడు ఎంత తీవ్రంగా మారిందంటే.. సైన్స్ డైరెక్ట్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం 2050 నాటికి ప్రపంచంలో అత్యధిక మరణాలు దీని కారణంగానే సంభవించవచ్చు. ఈ నేపథ్యంలో మీరు కూడా అవసరం కంటే ఎక్కువ మందులు తీసుకుంటున్నారా? అలా చేస్తే మీ శరీరంలో యాంటీబయాటిక్స్ పని చేయడం ఆగిపోతుంది.

యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన శరీరంలోని బ్యాక్టీరియా లేదా వైరస్‌లు మందులు పనిచేయని స్థాయిలో బలంగా మారితే దానిని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR) అంటారు. సాధారణ జలుబు, జ్వరం లేదా అంటువ్యాధులకు తీసుకునే యాంటీబయాటిక్ మందులు తరచుగా మనల్ని నయం చేస్తాయి. అయితే వీటిని అవసరం కంటే ఎక్కువగా లేదా తప్పుగా ఉపయోగించడం వల్ల ఆ బ్యాక్టీరియా ఈ మందులకు వ్యతిరేకంగా నిరోధక శక్తిని అభివృద్ధి చేసుకుంటాయి.

WHO నివేదిక ప్రకారం.. 2019లో 12.7 లక్షల మంది ప్రజలు నేరుగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కారణంగా మరణించారు. దాదాపు 49.5 లక్షల మరణాలలో ఇది పరోక్ష కారణంగా ఉంది. అందుకే దీనిని భవిష్యత్తు ‘సైలెంట్ పాండమిక్’ అని పిలుస్తున్నారు.

Also Read: X Down: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఎక్స్‌ సేవలు!

భారతదేశంలో పెరుగుతున్న యాంటీబయాటిక్ ముప్పు

భారతదేశంలో ప్రతి సంవత్సరం బిలియన్ల డోసుల యాంటీబయాటిక్స్ వినియోగించబడుతున్నాయి. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. లాన్సెట్ ఈ-క్లినికల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. 83 శాతం భారతీయ రోగులలో మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ (MDRO) కనుగొనబడ్డాయి. అంటే ఈ రోగులపై సాధారణ యాంటీబయాటిక్స్ ప్రభావం చూపడం మానేశాయి. ఈ పరిస్థితి రోగులకే కాకుండా దేశ ఆరోగ్య వ్యవస్థకు కూడా పెద్ద ముప్పుగా పరిగణించబడుతోంది.

ఈ అధ్యయనం ప్రకారం భారతదేశం ‘సూపర్‌బగ్ విస్ఫోటనం’కు కేంద్రంగా ఉంది. ఎండోస్కోపిక్ ప్రక్రియలకు లోనయ్యే రోగులలో MDRO ఉనికి ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. భారతదేశంలో 83 శాతం రోగులలో MDRO కనుగొనబడింది. ఇటలీలో 31.5 శాతం, అమెరికాలో 20.1 శాతం, నెదర్లాండ్స్‌లో 10.8 శాతం కేసులలో మాత్రమే ఈ సమస్య ఉంది.

వైద్యులు ఇచ్చిన హెచ్చరిక

ఈ సమస్యపై నిపుణులు హెచ్చరిక చేస్తూ ఇప్పుడే సరైన చర్యలు తీసుకోకపోతే రాబోయే సంవత్సరాలలో పరిస్థితి అదుపు తప్పిపోతుందని తెలిపారు. WHO కొత్త నివేదిక ప్రకారం.. భారతదేశం కూడా భాగమైన ఆగ్నేయాసియా ప్రాంతం ఈ సమస్యతో అత్యంత ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటి. ప్రతి అనారోగ్యానికి యాంటీబయాటిక్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. చాలాసార్లు వైరల్ జ్వరం లేదా జలుబు 2 నుండి 3 రోజుల్లో వాటంతట అవే నయమవుతాయి. డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం మరింత ప్రమాదకరమని వారు హెచ్చరించారు.

Exit mobile version