Diabetes Control: మధుమేహం (డయాబెటిస్) అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోయినప్పటికీ సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో చక్కెర స్థాయిలను (Diabetes Control) నియంత్రణలో ఉంచవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు గుండె, కిడ్నీలు, ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆహార నియంత్రణ ఎందుకు ముఖ్యం?
డయాబెటిస్ రోగులు తీసుకునే ఆహారం వారి రక్తంలో చక్కెర స్థాయిలపై నేరుగా ప్రభావం చూపుతుంది. కొన్ని ఆహార పదార్థాలు చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. అటువంటి వాటికి దూరంగా ఉండటం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. దీనికి బదులుగా పోషకాలతో నిండిన, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆకుపచ్చ కూరగాయలు: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఆకుపచ్చ కూరగాయలు చాలా ఉపయోగపడతాయి. వీటిలో కేలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కీరదోస, బీన్స్, బ్రోకలీ వంటివి తీసుకోవడం ద్వారా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అవసరమైన పోషకాలు అందుతాయి.
నీరు: శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవడం ముఖ్యం. ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
తక్కువ స్టార్చ్ ఆహారాలు: హెల్త్‌లైన్ ప్రకారం.. అధిక రక్త చక్కెర ఉన్నవారు తక్కువ స్టార్చ్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. అధిక స్టార్చ్ ఉన్న ఆహారాలు చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి.
డయాబెటిస్ రోగులు తప్పనిసరిగా నివారించాల్సిన ఆహారాలు
మైదా.. దాని ఉత్పత్తులు: మైదాతో తయారు చేసిన బ్రెడ్, పాస్తా, కేకులు వంటివి రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచుతాయి. వీటిలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ రోగులు వీటిని పూర్తిగా నివారించాలి.
అధిక బియ్యం: బియ్యం అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. బియ్యానికి బదులుగా ఇతర ధాన్యాలను తీసుకోవడం మంచిది.
ఫాస్ట్ ఫుడ్: పిజ్జా, బర్గర్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌లో మైదా, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడమే కాకుండా, ఇతర ఆరోగ్య సమస్యలకూ దారితీస్తాయి.
కొవ్వు అధికంగా ఉండే పాల ఉత్పత్తులు: అధిక రక్త చక్కెర స్థాయి ఉన్నవారు కొవ్వు అధికంగా ఉండే పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. పెరుగు, పాలు, జున్ను వంటివి తీసుకోవడం తగ్గించాలి.