దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (Corona virus) మళ్లీ విజృంభిస్తోంది. నూతన వేరియంట్లు NB 1.8.1, LF 7లను భారతదేశంలో గుర్తించారు. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో వ్యాప్తి తక్కువగానే ఉన్నా, అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ లక్షణాలు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. ఎక్కువగా జ్వరం, పొడి దగ్గు, గొంతునొప్పి, వాసన లేదా రుచి కోల్పోవడం, అలసట, శ్వాస ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన కేసుల్లో ఛాతీలో నొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు, నిద్రలేమి, శరీరంలో రంగు మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
Akshara Andhra : 100 శాతం అక్షరాస్యత కోసం ‘అక్షర ఆంధ్ర’ – నారా లోకేష్
కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావితం చేస్తుంది. వైరస్ నోరు, ముక్కు, కళ్లు ద్వారా శరీరంలోకి ప్రవేశించి గొంతులోని కణాలపై దాడి చేస్తుంది. ఇది రక్తప్రవాహంలోకి చేరి ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది. గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడతాయి, గుండె రద్దీ, గుండెపోటుకు దారితీస్తుంది. జీర్ణ వ్యవస్థలో వాంతులు, విరేచనాలు కనిపించవచ్చు. మెదడు, మూత్రపిండాలు, కండరాలు, నరాల వ్యవస్థ కూడా ఈ వైరస్ కారణంగా నెమ్మదిగా దెబ్బతింటున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా కీలకం. రద్దీ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. చేతులను తరచూ హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇతరులతో కనీసం ఒక మీటర్ భౌతిక దూరం పాటించాలి. దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండి ఇతరులకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడాలి. లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం ద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చు.