మామూలుగా మనం వాటర్ తాగడం కోసం కొంతమంది ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉపయోగిస్తే మరికొందరు స్టీల్ మరికొందరు కాపర్ వాటర్ బాటిల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది స్టీల్ కాపర్ వాటర్ బాటిల్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే నిజానికి స్టీల్ వాటర్ బాటిల్ అలాగే కాపర్ వాటర్ బాటిల్ ఈ రెండిట్లో ఏది మంచిది? రెండిట్లో ఏ దాంట్లో నీరు తాగితే మంచి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మొదట రాగి వాటర్ బాటిల్ విషయానికి వస్తే.. పూర్వం ఎక్కువ మంది రాగి పాత్రలనే ఉపయోగించేవారు. నీటి కొలనుల్లో రాగి నాణేలను వేసే సంప్రదాయం కూడా ఇలాగే వచ్చింది. రాగి పాత్రల్లో నీటిని నిల్వ చేయడం వల్ల ఈ ఖనిజం నీటిలో స్వల్ప స్థాయిలో కలుస్తుందట. దీంతో రాగి పాత్రల్లోని నీరు అద్భుత ఔషధ గుణాలు సంతరించుకుంటాయని చెబుతున్నారు. అదేవిధంగా రాగికి సూక్ష్మక్రిములను నిర్వీర్యం చేసే శక్తి ఉంటుంది. రాగి పాత్రల్లో నీటిని తరచుగా తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బలోపేతమవుతుందట. అలాగే పేగుల ఆరోగ్యం కూడా మెరుగవుతుందని చెబుతున్నారు. థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరచడంలో కూడా రాగి ఎంతో బాగా ఉపయోగపడుతుందట. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందట. అలాగే ఒత్తిడిని తగ్గించడంలో కూడా రాగి పాత్రలో నీరు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. రాగి పాత్రల్లోని నీరు ఫ్రీరాడికల్స్ ను నిర్వీర్యం చేసే శక్తి ఉంటుందట.
స్టీల్ బాటిల్స్ విషయానికి వస్తే.. రాగి బాటిల్స్‌తో ఉన్నన్ని లాభాలు స్టీల్ బాటిల్స్ తో ఉండవు. కానీ స్టెయిన్ లెస్ స్టీల్ నీటి పై ఎలాంటి ప్రభావం చూపదు. అందుకే ఇందులో నిల్వ ఉంచిన నీరు ఎక్కువ కాలం శుభ్రంగా ఉంటుంది. స్టీల్ పాత్రలు తుప్పు పట్టవు. కాబట్టి ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. ఈ బాటిల్ లో నీరు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు నిల్వ ఉంటాయి.
ఇంతకీ ఈ రెండింటిలో ఏది మంచిది అన్న విషయానికొస్తే.. రాగి, స్టీల్ బాటిల్ రెండింటిలోనూ విభిన్నమైన లాభాలు ఉన్నాయి. అయితే స్టీల్ తో పోలిస్తే రాగి బాటిల్స్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే రాగి బాటిల్స్ ను తరచూ శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇవి త్వరగా రంగు మారుతాయి. అయితే రాగి పాత్రలో నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. స్టీల్ బాటిల్ లో అలాంటి ప్రయోజనాలు లేకపోయినప్పటికీ ప్లాస్టిక్ బాటిల్ తో పోల్చితే చాలా మంచిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు.