Contraceptive Pills for Men: ఇక మగవారికీ గర్భ నిరోధక మాత్రలు

గర్భనిరోధక మాత్రలు.. ఇవి కేవలం మహిళల కోసమే అనేది పాట ముచ్చట. 

గర్భనిరోధక మాత్రలు (Contraceptive Pills) ఇవి కేవలం మహిళల కోసమే అనేది పాట ముచ్చట. ఇప్పుడు గర్భనిరోధక మాత్రలు (Contraceptive Pills) పురుషుల కోసం రెడీ అవుతున్నాయి. మహిళలు గర్భ నిరోధక మాత్రలు వాడటం వల్ల అనేక రకాల సమస్యలను వారు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా హార్మోన్ల సమతుల్యం దెబ్బతినడం.. రుతుక్రమం సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఇంతకుముందు వరకు పురుషులు గర్భనిరోధక సాధనంగా కండోమ్స్ వాడేవారు. లేదంటే వ్యాసెక్టమీ చేయించుకునే వారు.

ఇకపై అంత కష్టం అక్కర్లేదు. ఎందుకంటే అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న వీల్ కార్నెల్ మెడిసిన్ శాస్త్రవేత్తలు పురుషుల కోసం గర్భ నిరోధక మాత్రను తయారు చేశారు. ఇది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను ప్రభావితం చేసే సోల్యూబుల్ అడెనిలిల్ సైక్లాస్(ఎస్ఏసీ) అనే ప్రోటీన్ లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది. ఈ ప్రోటీన్ ఉత్పత్తి కాకుండా ట్యాబ్లెట్ నిరోధిస్తుంది. ఫలితంగా ఈ మాత్ర వాడే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది.

ప్రయోగం ఇలా జరిగింది..

మగ ఎలుకలకు టీడీఐ11862 అనే ఎస్ఏసీ నిరోధకాన్ని ఇచ్చి.. తర్వాత అది ఆడ ఎలుకలతో కలిసేలా చేశారు. దాదాపు 52 సార్లు సంభోగం అయ్యేలా ఎలుకలను ప్రోత్సహించినప్పటికీ ఒక్క ఆడ ఎలుక కూడా గర్భం దాల్చ లేదు. అంతేకాక ఇది చాలా వేగంగా పనిచేసిందని పరిశోధకులు కొనుగొన్నారు. 30 నుంచి 60 నిమిషాల్లోనే ఎలుకల స్పెర్మ్ పై దీని ప్రభావం కనిపించింది. అలాగే 100 శాతం ప్రభావవంతంగా ఇది పనిచేసింది. అయితే ఈ ట్యాబ్లెట్ ప్రభావం ఆ మగ ఎలుకపై 24 గంటల వరకూ మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత ఎలుకలకు తిరిగి సంతానోత్పత్తి సాధించగలిగే విధంగా శక్తిని పుంజుకున్నాయి. ఆరు వారాల వరకూ పరిశోధకులు ఎలుకలకు ఈ మందు రోజూ ఇచ్చినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లు కలుగలేదు. ఈ మాత్ర ఇంకా ట్రయల్ దశలోనే ఉంది.ఇప్పటివరకు, క్లినికల్ ట్రయల్స్ ఎలుకలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. తదుపరి రౌండ్‌లో కుందేళ్ళపై ఈ మాత్రను టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మాత్రమే మనుషులపై ట్రయల్స్ మొదలుపెడతారు. ‘నేచర్ కమ్యూనికేషన్స్‌’ జర్నల్ లో దీనికి సంబంధించిన స్టడీ రిపోర్ట్ పబ్లిష్ అయింది.

ట్రయల్స్‌ మూడేళ్లు.. మాత్రల ఉత్పత్తికి 8 ఏళ్లు

మనుషులపై తొలి దశ ట్రయల్స్‌ ను వచ్చే మూడేళ్లలోపు చేయాలన్న ఆలోచనలో పరిశోధకులున్నారు. ప్రక్రియ తుది దశకు వచ్చి.. ఉత్పత్తి చేసేందుకు కనీసం ఎనిమిదేళ్లు పట్టవచ్చని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అవాంఛిత గర్భాల శాతం పెరుగుతోందని తెలిపారు. ‘‘పురుషులు సెకనుకు వెయ్యి వీర్య కణాలను ఉత్పత్తి చేస్తారు. గర్భాశయాన్ని ఫలదీకరణం చేయకుండా ఆపాలంటే.. మిలియన్ల సంఖ్యలో ఉండే వీర్య కణాలను నిరోధించేందుకు అవసరమైన వ్యూహం ప్రభావవంతంగా ఉండాలి. ఈ నేపథ్యంలోనే పురుషులకు గర్భ నిరోధక మాత్రలు తయారీ చాలా కష్టంగా ఉంది’’ అని పరిశోధన పత్రాల్లో పేర్కొన్నారు.

Also Read:  Marriage: పెళ్లి చేసుకున్న వాళ్లకు 30 రోజులు పెయిడ్ లీవ్స్