Contraception : గర్భనిరోధకం స్త్రీల వ్యవహారమా.. ?

గర్భనిరోధకం స్త్రీలకు సంబంధించిన వ్యవహారం అనే భావన భారతీయ పురుషుల్లో స్థిరపడిపోయింది. దీంతో, పురుషుల్లో...

  • Written By:
  • Updated On - November 9, 2022 / 07:55 AM IST

గర్భనిరోధకం స్త్రీలకు సంబంధించిన వ్యవహారం అనే భావన భారతీయ పురుషుల్లో స్థిరపడిపోయింది. దీంతో, పురుషుల్లో గర్భనిరోధక పద్దతి పాటించే రేటు ఏడాదికేడాదికి తగ్గిపోతోంది.దీనిపై ఇటీవల భారత వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ముంబైలోని ఇంటర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేసింది. అందులోని ముఖ్యాంశాలను మీ ముందుంచుతున్నాం. కర్ణాటకలో సగానికి పైగా మహిళలు గర్భనిరోధక ఆపరేషన్లు చేయించుకుంటున్నట్లు ఈ సర్వేలో తేలింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో రెండవ స్థానంలో ఉన్న భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1950లో ఒక మహిళకు 5.9 ఉండగా, నేడు అది 2.2 కు పడిపోయింది. దీనిని మంచి పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు.

2021లో 14.7 కోట్ల మంది భారతీయ మహిళలు ఆధునిక గర్భనిరోధక సాధనాలను ఉపయోగించారు. వీరిలో 37.9 శాతం మంది స్త్రీలు గర్భనిరోధక ఆపరేషన్లు చేయించుకున్నారు. పురుషులు మాత్రం గర్భనిరోధకం అనేది తమకు సంబంధించిన వ్యవహారంగా భావించడం లేదు. ప్రతి 10 మందిలో ఒకరి కంటే తక్కువ మంది పురుషులు కండోమ్‌లను ఉపయోగిస్తున్నారు. ప్రతి 10 మందిలో నలుగురు స్త్రీలు గర్భం రాకుండా నివారించేందుకు గర్భనిరోధక ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. 84 శాతం మంది స్త్రీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే గర్భనిరోధక ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. కర్ణాటకలో 15-19 సంవత్సరాల వయస్సు గల పురుషుల్లో 45 శాతం మంది గర్భనిరోధకం స్త్రీలకు సంబంధించిన వ్యవహారం అని, దీనిపై తాము ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. సంవత్సరాలుగా పురుషులు గర్భనిరోధక ఆపరేషన్లు చేయించుకునే రేటు తగ్గుముఖం పడుతోంది. కర్ణాటకలో సగానికి పైగా మహిళలు గర్భనిరోధక ఆపరేషన్లు చేయించుకుంటున్నారు.

ఇతర రాష్ట్రాల్లో మహిళలు, పురుషులు గర్భనిరోధక ఆపరేషన్లు చేయించుకునే రేటు ఈ దిగువ తెలిపిన విధంగా ఉంది.

రాష్ట్రం మహిళలు – పురుషులు
హర్యానా 32.3% – 0.9%
రాజస్థాన్ 35.5% – 0.3%
ఢిల్లీ 18% – 0.2%
మహారాష్ట్ర 49.1% – 0.4%
కర్ణాటక 57.4% – 0.0%
కేరళ 46.6% – 0.1%
చత్తీస్ ఘడ్ 47.5% – 0.8%
ఆంధ్రప్రదేశ్ 69.6% – 0.4%
తమిళనాడు 57.8% – 0.1%

1970 ఎమర్జెన్సీ కాలంలో పురుషులు గర్భనిరోధక ఆపరేషన్ వేసెక్టమీ 74.2 శాతం చేయించుకోగా, అది 1992లో 4.2 శాతానికి పడిపోయింది. అంటే, గర్భనిరోధం తమకు సంబంధించిన వ్యవహారం కాదని పురుషులు ఎంతలా భావిస్తున్నారో అర్ధమవుతోంది.